దీపంగా ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనుకునే రోజుల్లో కాస్తో కూస్తో విలువలు ఉన్నవారికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా సినిమా, క్రికెట్ లాంటి రంగాల్లోని సెలబ్రిటీలు ఏం చేసినా గుడ్డిగా ఫాలో అయ్యే అభిమానులకు కొరత లేదు. దీన్ని అలుసుగా తీసుకొని ప్రచార ప్రకటనల్లో, ఇతరత్రా ప్రోగ్రామ్‌లు, రిబ్బన్ కటింగ్‌ల ద్వారా సంపాదించే సెలబ్రిటీలే అధికం.
దీనికి భిన్నంగా ఆలోచించి డబ్బులు వదులుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయమే. సవ్యసాచి హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ కోవలోకే వస్తుంది. జనాలకు ఏమైపోతే మనకేంలే అనుకోకుండా తాను నమ్మని ఫెయిన్ నెస్ క్రీమ్ యాడ్‌లో నటించడానికి నిరాకరించింది. సినిమా తారలు వాడే సబ్బులు, క్రీమ్‌లు వాడే అమ్మాయిలు తక్కువేమీ కాదు. అందుకే అభిమానులను దృష్టిలో ఉంచుకొని యాడ్‌లో నటించలేదని పేర్కొంది.
హీరోయిన్లు చెబితే ఆ వస్తువు మీద చాలా క్రేజ్ ఏర్పడుతుంది. తీరా అది సరిగా పనిచేయకపోతే దాన్ని ప్రచారం చేసినవారి మీద కూడా నమ్మకం పోతుంది. అందుకే తాను ఇటీవల ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో నటించలేదని చెప్పింది. అందంగా ఉండాలంటే.. ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు అవసరం లేదనీ, సహజసిద్ధంగా మనకు లభించే వాటితోనే అందం పెరుగుతుందని అమ్మాయిలకు సలహా ఇచ్చింది.