తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉన్న నటి కాజల్ అగర్వాల్. చిరంజీవి, తారక్, రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరోల దగ్గర్నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వరకు దాదాపు అందరితో హీరోయిన్‌గా నటించింది కాజల్. అయితే మిగతా హీరోయిన్‌ల మాదిరిగా కాజల్ పెద్దగా వివాదాల జోలికి పోదు. అయితే ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌లో సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు కాజల్‌ను స్టేజీ మీద ముద్దు పెట్టుకోవడం రచ్చ రచ్చ అయింది. సోషల్ మీడియాలో కాజల్ అభిమానులు చోటా కె. నాయుడును దుమ్మెత్తిపోశారు.
కాజల్ మాత్రం ఇటీవలి వరకు దీని గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఆ ముద్దు సంఘటన గురించి నోరు విప్పక తప్పలేదు. చోటా కె. నాయుడు బహిరంగంగా స్టేజీ మీద అలా ముద్దు పెట్టుకోవడం తనను షాక్‌కు గురి చేసిందని కాజల్ తెలిపింది. చోటా కె. నాయుడు నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఆయన చెడు అభిప్రాయాలు ఏర్పరచుకునే వ్యక్తి కాదు. ఆరోజు అలా ముద్దు పెట్టుకోవడం నన్ను కూడా కొంత షాక్‌కు గురిచేసింది.. అని కాజల్ వెల్లడించింది.
అంతేకాకుండా ఆ విషయాన్ని పెద్దది చేసి చూడాల్సిన అవసరం లేదని మీడియాకు తెలిపింది. ఈవెంట్ అయిపోయాక చోటా కె. నాయుడు తనకు సారీ చెప్పినట్టు తెలిపింది. ఆ సంఘటన వల్ల నువ్వు ఇబ్బంది పడి ఉంటే క్షమించమని చోటా తనను అడిగినట్టు కాజల్ వెల్లడించింది. కాజల్ కూడా నవ్వుతూ స్పందించడంతో ఈ విషయం ఇక ముగిసినట్టే అని భావించవచ్చు.