బయోపిక్‌ల పుణ్యమా అని కొంతమంది తారలకు విభిన్న రకాల అవకాశాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌లో భారీ తారాగణం చూస్తున్నాం. చాలామంది హీరో, హీరోయిన్లు రకరకాల పాత్రల్లో అలరించబోతున్నారు. అలాగే యాత్ర సినిమా కూడా కొన్ని అనూహ్య పాత్రధారులను బయటికి తీసుకొచ్చింది. ముఖ్యంగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ పాత్రకు సంబంధించిన ఫొటోను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. అంతగా ప్రాచుర్యం లేని ఆశ్రిత వేముగంగి విజయమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఫొటోకు మంచి ఆదరణ లభించింది.
ఆశ్రిత బాహుబలి సినిమాలో కన్నా నిదురించరా పాటతో గుర్తింపు పొందారు. తను మంచి డ్యాన్సర్ కూడా. వై.ఎస్.ఆర్. జీవితం ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో విజయమ్మ పాత్ర లభించడంతో ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చారు.
ఈ సినిమాలో వైఎస్‌గా మళయాళం నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. అలాగే వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు నటిస్తుండటం విశేషం. జగపతిబాబు ఫొటోను కూడా ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాకు మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.