భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బయోపిక్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా బయోపిక్ నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు సానియా మీర్జా, నిర్మాత మధ్య ఒప్పందం కూడా కుదింరింది. సానియా బయోపిక్ పని ఇప్పటికే ప్రారంభం అయింది కూడా. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా తేలలేదు. అలాగే సానియా మీర్జా పాత్రను ఎవరు పోషించనున్నారనేది కూడా ఇంకా ఖరారు కాలేదు.
భారతదేశం తరఫున టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్ (డబుల్స్) గెలిచిన ఏకైక భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. ఈ బయోపిక్‌లో సానియా మీర్జా ఇవ్వనున్న ఇన్‌పుట్స్ ముఖ్యం కానున్నాయి. దర్శకుడు, రచయిత, నటీనటుల ఎంపిక ఈ సినిమాకు అత్యంత కీలకం కానుంది.
క్రీడాకారుల జీవితం ఆధారంగా వచ్చిన అనేక సినిమాలు ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాయి. మేరీ కోమ్, దంగల్, భాగ్ మిల్ఖా భాగ్, ఎం ఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ వంటి బయోపిక్‌లు బాగా ఆదరణ పొందాయి. ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర కూడా తయారవుతోంది. ఇందులో సైనా నెహ్వాల్ పాత్రంలో శ్రద్ధ కపూర్ నటిస్తుంది. అయితే దేశంలో సానియా మీర్జాను ఉన్నంత క్రేజ్ మహిళా క్రీడాకారుల్లో ఎవరికీ లేదని చెప్పవచ్చు. అందుకే సానియా బయోపిక్‌పై ఆసక్తి పెరుగుతోంది.