ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రలు లక్ష్మీ పార్వతి, చంద్రబాబునాయుడు. ఈ పాత్రలను పోషిస్తున్న నటుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. లక్ష్మీ పార్వతిగా వీరప్పన్ సినిమాలో నటించిన యగ్నా షెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో నాటక రంగానికి చెందిన ఓ వ్యక్తి నటిస్తున్నారు.
యగ్నా షెట్టి వర్మ తీసిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిగా నటించింది. కన్నడంలో మరో సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా ఆమె అందుకున్నారు. వర్మ ప్రకటనతో ఈ పాత్రపై సందిగ్ధం తొలగింది.
వర్మ ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలను రిలీజ్ చేశారు. వీటిలో వెన్నుపోటు అనే పాట వివాదాస్పదంగా మారింది. దీన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం నేతలు అనేక విమర్శలు చేశారు. ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వైసీపీతో సంబంధం ఉన్న రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.