ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్‌ – టార్గెట్‌ చంద్ర‌బాబు

ముందుగా ప్ర‌క‌టించిన విధంగానే వాలంటైన్స్ డే రోజున ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్‌ను రామ్‌గోపాల్ వ‌ర్మ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైల‌ర్‌లో చంద్ర‌బాబు ల‌క్ష్యంగా అన్ని సీన్‌లు ఉన్నాయి. ఈ సినిమాకు కుటుంబ కుట్ర‌ల చిత్రం అని ట్యాగ్‌లైన్‌లో పెట్ట‌డం ద్వారా చంద్ర‌బాబుతోపాటు ఎన్టీఆర్ ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను కూడా వ‌ర్మ టార్గెట్ చేశారు.

ట్రైల‌ర్లో 1989 ఎన్నిక‌ల త‌ర్వాత సంఘ‌ట‌న‌ల‌ను చూపించారు. ‘1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తరువాత రోజులవి’ అంటూ మొద‌లై…. ఎన్టీఆర్ చంద్ర‌బాబు గురించి చేసిన డైలాగ్‌తో ముగుస్తుంది. ఎన్టీఆర్ క‌న్నీళ్లు రాలుస్తూ…. ‘నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నేను నమ్మడం’ అంటూ ట్రైల‌ర్‌ను ముగించారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

మ‌ధ్యలో అనేక భావోద్వేగ సీన్లు ఉన్నాయి. ఇవ‌న్నీ ఒక సీక్వెన్స్‌లో చూపించ‌డం ద్వారా సినిమా క‌థ‌ను దాదాపు క‌ళ్ల‌కుక‌ట్టారు వ‌ర్మ‌. ఎన్టీఆర్‌ను కుటుంబ స‌భ్యులు ప‌ట్టించుకోక‌పోవ‌డం, ల‌క్ష్మీ పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి ప్ర‌వేశించ‌డం, పార్టీ వ్య‌వ‌హారాల్లో క‌లుగ‌జేసుకోవ‌డం, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వ‌తి వివాహం, వైస్రాయ్ సంఘ‌ట‌న‌, ఎన్టీఆర్‌పై చెప్పులు విస‌రడం.. ఇలా సాగింది ట్రైల‌ర్‌.

ఎన్టీఆర్ చ‌నిపోయిన స‌న్నివేశం ట్రైల‌ర్‌లో లేదు. దీన్ని ఎలా చిత్రీక‌రించార‌నేది సినిమాలో చూడాల్సిందే. మొత్తానికి ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. మ‌రో వైపు బాల‌కృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు కూడా సిద్ధ‌మ‌వుతుంది. క‌థ‌నాయ‌కుడు అనుకున్నంత‌గా ఆడ‌క‌పోవ‌డంతో దీనిపై మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌, ఎన్టీఆర్ మ‌హానాయకుడు సినిమాల నేప‌థ్యం ఒక‌టే కావ‌డం విశేషం.

Watch Trailer Here: https://www.youtube.com/watch?v=WbtiDxR1DZY