ఎన్టీఆర్ – మహానాయకుడు విడుదలకు సిద్ధమవుతుంది. తొలిభాగం కథానాయకుడు అనుకున్నంత హిట్ కాకపోవడంతో రెండో భాగంలో చిత్ర బృందం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. తొలిభాగంలో మిస్సయిన భావోద్వేగ సన్నివేశాలను రెండో భాగంలో పెట్టినట్టు సమాచారం. మహానాయకుడు ట్రైలర్ చూస్తే ఇదే అర్థమవుతుంది. రెండో భాగంలో డ్రామా పాళ్లు బాగా ఉండే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ రాజకీయ జీవితం అందరికీ ఆసక్తికరమైన అంశమే. అనేక ఉద్వేగాలు, వివాదాలు, సంచనాలకు నిలయంగా ఎన్టీఆర్ రాజకీయ జీవితం కొనసాగింది. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు దగ్గర్నుంచి, ఎన్నో ప్రజాకర్షక పథకాలు, ఎన్నికల్లో జయాపజయాలు, కేంద్రంతో పోరాటం, జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్మీ పార్వతితో వివాహం, పార్టీలో తిరుగుబాటు.. ఇలా ఎన్నో సంచలనాలు ఎన్టీఆర్ మలిజీవితంలో చోటుచేసుకున్నాయి. వీటన్నిటినీ ఏ మేరకు తెర మీదకు ఎక్కించారనేది ఆసక్తికరంగా మారింది.
ట్రైలర్ను బట్టి ఇందులో ఎన్టీఆర్, చంద్రబాబు పాత్రలు కీలకంగా ఉన్నట్టు అర్థమవుతుంది. అలాగే కేంద్రంతో ఎన్టీఆర్ పోరాటాన్ని కూడా ప్రధానంగా చిత్రించినట్టు కనిపిస్తుంది. ప్రస్తుత ఏపీ రాజకీయాలను కూడా దృష్టిలో ఉంచుకొని కథను, కథనాన్ని మలిచినట్టు కనిపిస్తుంది. లక్ష్మీ పార్వతి పాత్రను ఆమని పోషించినట్టు సమాచారం.
ఎన్టీఆర్ మలి దశ నిజజీవితంలో ప్రధాన ఘట్టాలు, మలుపులను ఎంత ఆసక్తికరంగా తీర్చారనేదాన్ని బట్టే ఈ సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. మరోవైపు రామ్గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా విడుదలకు సిద్ధమవుతుంది. దీంతో ఎన్టీఆర్ మహానుభావుడులో ఏం ఉంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది.