మిస్ట‌ర్ మ‌జ్ను.. 8 ప్యాక్ బోర్‌

మూడో సినిమా ద్వారానైనా హిట్ కొట్టాల‌న్న అఖిల్ అక్కినేని క‌ల క‌ల‌గానే మిగిలిపోయేట్టుంది. మిస్ట‌ర్ మ‌జ్ను ఇవాళ రిలీజైంది. అఖిల్‌, హ‌లో సినిమాల త‌ర్వాత అఖిల్ అక్కినేని న‌టించిన మూడో సినిమా ఇది. నిధి అగర్వాల్ అఖిల్ స‌ర‌స‌న న‌టించింది. ఇద్ద‌రూ క‌లిసి రిలీజ్‌కు ఒక రోజు ముందు తిరుప‌తి వెళ్లి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి పూజ‌లు కూడా చేశారు. అయినా సినిమాపై అంత గొప్ప టాక్ రాలేదు.

సినిమా ద‌ర్శ‌కుడు వెంటీ అట్లూరి త‌న మొద‌టి సినిమా తొలిప్రేమ ప్లాట్‌నే ఇందులో కూడా కొంచెం అటుఇటుగా ఉప‌యోగించారు. దీంతో ఎక్క‌డా సినిమాలో ప్ర‌త్యేక‌త క‌నిపించ‌లేదు. అఖిల్ అన్న‌ట్టు మిస్ట‌ర్ మ‌జ్ను కూడా అఖిల్‌కు ఇంకో మొద‌టి సినిమానే. మిస్ట‌ర్ మ‌జ్ను కూడా అఖిల్‌కు మ‌రో రీ లాంచ్ సినిమానే అంటున్నారు సినీ విమ‌ర్శ‌కులు.

మిస్ట‌ర్ మ‌జ్ను విడుద‌లకు ముందు కూడా పెద్ద‌గా ఆకట్టుకోలేదు. ట్రైల‌ర్‌గానీ, ఆడియోగానీ సాదాసీదాగానే ఉండ‌టంతో పెద్ద‌గా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకోలేదు ప్రేక్షకులు. సినిమా కూడా అలాగే ఉండ‌టంతో మ‌రో ఫ్లాప్‌ను అఖిల్ సొంతం చేసుకున్న‌ట్ట‌యింది. ప్ర‌స్తుతం వేరే సినిమాలు ఏవీ లేవు కాబ‌ట్టి క‌లెక్ష‌న్ల ప‌రంగా కొంత నిల‌దొక్కుకోవ‌చ్చు గానీ ప్రేక్ష‌కుడిని సినిమా థియేట‌ర్‌కు రప్పించేంత సీన్ సినిమాకు లేదు.

విదేశీ నేప‌థ్యం, అఖిల్‌ 8 ప్యాక్ బాడీ త‌ప్ప సినిమాలో ఏమీ లేద‌ని ప్రివ్యూ చూసిన అభిమానులు నిరాశ వ్య‌క్తం చేశారు. హైప‌ర్ ఆది ఓవ‌రాక్ష‌న్ కూడా తోడ‌వ‌తంతో సెకండాఫ్ కూడా డ‌ల్‌గానే ఉంద‌ట‌. మొత్తం మీద వెంకీ అట్లూరి ఎలాంటి న‌వ్య‌త్వం లేకుండా పాత ప్రేమ ఫార్ములాతోనే సినిమాను లాగించాడు.