క‌త్తి ఒక్క‌టే కొత్త‌ది.. అదే ర‌క్తం, అదే క‌థ‌

సినిమా: వినయ విధేయ రామ
తారాగ‌ణం: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్ రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్ మొద‌లైన‌వారు.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
నిర్మాత: డీవీవీ దానయ్య
దర్శకత్వం: బోయపాటి శ్రీను

పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ చూసిన‌ప్పుడే జ‌నాల‌కు విన‌య విధేయ రామ సినిమాపై ఒక అంచ‌నా ఏర్పడి ఉంటుంది. కొత్త‌త‌రం క‌త్తి ఒక‌టి క‌నిపించింది. రౌడీల‌ను ఈడ్చుకెళ్ల‌డం క‌నిపించింది. తెర‌నిండా ర‌క్త‌పు చార‌లు… ఇంత‌కంటే ఏం కావాలి… బోయ‌పాటి సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవ‌డానికి. రామ్ చ‌ర‌ణ్ ఒక్క‌డే కొత్త త‌ప్ప.. ఇదే క‌థ‌, క‌థ‌నం, పాత్ర‌లో బాల‌కృష్ణ‌ను, ఇత‌ర ఏ మాస్ హీరోనైనా ఊహించుకోవ‌చ్చు.

vinaya vidheya rama review

క‌థ ష‌రా మామూలే…. హీరోకు ఓ పెద్ద కుటుంబం. హీరో అన్నకు, విల‌న్‌కు ఏదో గొడ‌వ‌. బీహార్‌లో ఎలాగూ రౌడీలు ఉంటారు కాబ‌ట్టి.. వివేక్ ఒబెరాయ్ వ‌స్తాడు. ఇక హీరో, బీహార్ రౌడీల మ‌ధ్య వ్యూహ ప్ర‌తివ్యూహాలు.. చివ‌ర్లో హీరో గెల‌వ‌డానికి ఓ అర‌గంట హింస‌. బోయ‌పాటి గ‌త సినిమాల్లాగే ఇందులో కూడా యాక్ష‌న్ మోతాదు ఎక్కువ‌. ఎక్కువ అన‌డం కంటే శ్రుతి మించింది అంటే బాగుంటుందేమో.

సినిమా ఫ‌స్ట్ ఆఫ్ అంతా హీరో కుటుంబం తెర మీద క‌నిపిస్తుంది. ఎప్పుడూ ఓ ప‌ది మంది తెర మీద క‌దుల్తుంటారు. సినిమా సెకండాఫ్ అంతా ఫైట్ల మ‌యం. ఇక్క‌డా ఎప్పుడూ ఓ ఇర‌వై మంది క‌దుల్తుంటారు. కాక‌పోతీ అంతా క‌త్తుల‌తో క‌దుల్తుంటారు, రౌడీలు కాబ‌ట్టి. దీన్ని బోయ‌పాటి భాష‌లో డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ అంటారు.

విల‌న్ బ‌లంగా ఉంటేనే హీరోయిజం అంత‌కంటే ఎక్కువ ఎలివేట్ అవుతుంద‌ని బోయ‌పాటి సినిమా సిద్ధాంతం. అందుకే ఇందులో కూడా విల‌న్ చాలా చోట్ల బ‌లంగా క‌నిపిస్తాడు. హీరోని డామినేట్ చేస్తాడు. హీరోకి మరింత క‌సి పెంచుతాడు. ఇదంతా చివ‌ర్లో భారీ ర‌క్త‌పాతానికి ప్రేక్షకుల‌ను సిద్ధం చేయ‌డానికి అన్న‌మాట‌. రామ్ చ‌ర‌ణ్ స్టెప్పుల్లో మ‌రింత ఊపు క‌నిపించింది.

బోయ‌పాటి శీను.. మాస్ సినిమాకు మ‌రోపేరుగా కొన‌సాగుతున్నారు. కానీ మాస్ సినిమా అంటే భ‌యంక‌ర‌మైన హింస‌, ర‌క్త‌పాతం త‌ప్ప క‌థ‌లు ఏమీ ఉండ‌వా? ఫ‌క్తు హీరోయిజం.. కుటుంబం గురించి పెద్ద పెద్ద డైలాగులు.. ఇదేనా మాస్ సినిమా? ఆ మాట‌కొస్తే రంగ‌స్థ‌లం కూడా మాస్ సినిమానే. అదే హీరో. రంగ‌స్థ‌లం వ‌ల్ల చ‌ర‌ణ్ హీరో ఇమేజ్ ఏమైనా త‌గ్గిందా? ఇదంతా ఎందుకంటే… మాస్ సినిమా అంటే ఏమిటో అర్థం చేసుకోవ‌డానికి బోయ‌పాటి శీను కొంచెం ఎద‌గాలేమో అనిపిస్తుంది.