సినిమా మార్కెటింగ్‌లో రామ్‌గోపాల్ వర్మ స్టయిలే వేరు. ఆయన సినిమా స్టార్ట్ చేశారంటే క్లాప్ కొట్టిన దగ్గర్నుంచి, టైటివ్ ఎనౌన్స్‌మెంట్, పాటలు, ట్రైలర్.. ఇలా ప్రతి దశలోనూ ఏదో ఒక సంచలనం లేదా వివాదం తప్పదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ముందుగా సినిమా పేరు ఎనౌన్స్ చేసి తన మార్కు వివాదానికి, ప్రచారానికి తెరలేపారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ తేదీని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే) అయిన ఫిబ్రవరి 14న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు వర్మ ట్వీట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు వెన్నుపోటు, ఎందుకు.. ఎందుకు వివాదాస్పదంగా మారాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సన్నివేశాలను అప్పుడొకటి అప్పుడొకటి రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తి, అంచనాలు పెంచుతున్నారు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల ప్రేమ కథకు గుర్తుగా ఈ సినిమా టీజర్‌ను వాలంటైన్స్ డే రోజులు విడుదల చేస్తామని ప్రకటించి మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే….. ‘ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి లవ్‌స్టోరీ అత్యంత డైనమిక్ లవ్ స్టోరీ’ .
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇతివృత్తాన్ని కూడా వర్మ క్లుప్తంగా చెప్పారు. ఇది కృతజ్ఞతలేని, విశ్వాసం లేని కుటుంబసభ్యులు, వెన్నుపోటు పొడిచి మోసం చేసిన వాళ్ల కథల కలయిక లక్ష్మీస్ ఎన్టీఆర్. అసలైన ఎన్టీఆర్ కథని చూడటానికి అందరూ సిద్ధంగా ఉండండి’’ అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.