కాళేశ్వరం ప్రాజెక్టును, హరీష్ రావును విడదీసి చూడలేం. టీఆర్ఎస్ – 1 ప్రభుత్వంలో నీళ్ల మంత్రిగా ఉంటూ ఆ ప్రాజెక్టుకు హరీష్ రావు పెట్టిన శ్రద్ధ అలాంటిది. ప్రాజెక్టు అమల్లో అడుగడుగునా ఇంజనీర్లకు, వర్కర్లకు మార్గనిర్దేశం చేయడమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించారు. టీఆర్ఎస్ – 2 హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా నీటి పారుదల ప్రాజెక్టుల బాట పట్టారు. ఇందులో భాగంగా కాళేశ్వరం కూడా సందర్శించారు. ఇతర ప్రాజెక్టులూ చూస్తున్నారు. మరి హరీష్ రావు ఎక్కడ?
కేసీఆర్ తనకు రాజకీయ వారసుడిగా కేటీఆర్‌ను ప్రోత్సహించడంలో ఎవరికి అభ్యంతరం ఉన్నా పట్టించుకునే పరిస్థితిలో కేసీఆర్ లేరు. కానీ ఈ ప్రక్రియలో హరీష్‌రావును ఇంతగా అవమానించాల్సిన అవసరం ఏముందనేది హరీష్ అనుచరులకు, అభిమానులకు అర్థం కావడం లేదు. దాదాపు అయిదేళ్లు నీటి పారుదల శాఖ బాధ్యతలు చూసి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఎన్నో ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో సాగునీటి వ్యవస్థకు ఒక రూపురేఖలు తెచ్చిన హరీష్‌రావుకు ఇలాంటి ట్రీట్‌మెంట్ లభించడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మంత్రి కాకపోయినా హరీష్ రావును ప్రాజెక్టుల సందర్శనకు తీసుకెళితే కేసీఆర్‌కు అడ్డుచెప్పేవారు ఎవరైనా ఉన్నారా?
కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టాక కేసీఆర్, హరీష్ రావు మధ్య క్రమేణా దూరం పెరుగుతున్నట్టు పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. మొదటి సంఘటన.. కేటీఆర్‌కు టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్ష పగ్గాలు ఇవ్వడం. ఫార్మాలిటీ కోసం హరీష్‌రావు ట్విటర్ ద్వారా కేటీఆర్‌కు అభినందనలు తెలిపినా ఆ దూరం స్పష్టంగా కనిపించింది.
తర్వాత కేసీఆర్ దాదాపు ఒక రోజు మొత్తం సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలు చేపట్టారు. ఇందులో అధికారులతోపాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. కానీ ఆ శాఖను చూసిన హరీష్ రావు సమీక్షలో లేరు. తాజాగా కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల యాత్రలో ఎక్కడా హరీష్ రావు ప్రస్తావన లేదు. ఎన్నికల సభల్లో మా నీళ్ల మంత్రి అంటూ హరీష్‌ను ఆకాశానికెత్తిన కేసీఆర్ ఇప్పుడు హరీష్‌రావును పూర్తిగా దూరంగా పెడుతుండటం ఆయన అభిమానులకు మింగుడుపడని విషయమే.
ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయనేది ముందుముందు చూడాలి. ఒక విషయం మాత్రం స్పష్టం. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా హరీష్ రావు రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర అధికారులు, మంత్రులు కూడా హరీష్‌ను ఎన్నోసార్లు అభినందించారు. ఆయనను దూరం పెట్టడానికి ఇదే కారణమా? నీటి పారుదల రంగం, ప్రాజెక్టుల విషయాల్లో నేరుగా కేసీఆర్ కల్పించుకుంటున్నారంటే ఇంకా నిధుల దుర్వినియోగం లాంటి ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి.