ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాలను శాసించనున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులు దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అందుకే అందరి చూపు ఇప్పుడు యూపీలో పొత్తులు ఎలా ఉంటాయా అనే దాని మీదే ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయంలో కాంగ్రెస్, బీఎస్పీ మధ్య విభేదాల విషయంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎవరికి వారే పోటీ చేశారు. కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో గెలిచినప్పటికీ మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బొటాబొటీ మెజారిటీనే వచ్చింది. అదే బీఎస్పీతో పొత్తు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ పరిస్థితి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే భిన్నంగా ఉంది. యూపీలో కాంగ్రెస్ కంటే బీఎస్పీ, ఎస్పీలదే పైచేయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో పొత్తుల విషయంలో కాంగ్రెస్ నాయకత్వం బీఎస్పీని గౌరవప్రదంగా ట్రీట్ చేయలేదనే భావన బీఎస్పీ చీఫ్ మాయావతిలో ఉంది. అందుకే ఒంటరిగా పోటీ చేసింది. ఇక యూపీలో ఇదే సీన్ రివర్స్ కానుంది. కాంగ్రెస్ అక్కడ కొన్ని సీట్లయినా గెలవాలంటే బీఎస్పీ, ఎస్పీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. మరి ఇప్పడు మాయావతి ఊరుకుంటుందా?
కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని బీఎస్పీ, ఎస్పీలు స్పష్టం చేశాయి. తాము చెరో 40 సీట్లలో పోటీ చేస్తామని కూడా చెప్పడంతో కాంగ్రెస్‌కు దాదాపు దారులు మూసుకుపోయినట్టే. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా యూపీలో కాంగ్రెస్‌కు లేదు. తాము ఆధిక్యంలో ఉన్నచోట ఇతర పార్టీలను చిన్నచూపు చూస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది కాంగ్రెస్‌కు ఈపాటకి అర్థమై ఉండాలి.
ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం దాదాపు అసాధ్యం. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తులకు వెళ్లక తప్పదు. అదే సమయంలో పట్టువిడుపులు ప్రదర్శించాలి. వేరే రాష్ట్రాల్లో మేం బలవంతులం కాబట్టి దేశంలోని అన్ని పార్టీలు మా మాటే వినాలంటే కుదరదు. ఇలాంటి వైఖరి వల్లే కాంగ్రెస్ కీలకమైన యూపీలో కనుమరుగైంది.