ఏపీలో మళ్లీ కోడి కత్తి కేసు అలజడి మొదలైంది. ఈ కేసు దర్యాప్తును తాము పూర్తి చేశామని ఏపీ పోలీసులు ఒకవైపు చెబుతుంటే, కొత్తగా ఏర్పాటైన హైకోర్టు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. జగన్‌పై కత్తి దాడి సంచలనం కోసం చేసిందేనని రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో తేల్చారు. వైసీపీ నాయకులు దీనిపై హైకోర్టుకు వెళ్లారు.
అయితే మొత్తం ఎపిసోడ్ చంద్రబాబు ప్రభుత్వం యూ టర్న్ కనిపిస్తుంది. దాడి జరిగినప్పుడు ప్రభుత్వ ప్రకటనలు ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది. ఎయిర్‌పోర్టు కేంద్ర పరిధిలో ఉంటుంది, కాబట్టి ఈ కేసుతో మాకు సంబంధం లేదు, అయినా మేము దర్యాప్తు చేస్తున్నామని మొదట ఏపీ ప్రభుత్వం, పోలీసు అధికారులు చెప్పారు. అదీగాక బాధితుడు కేసు కూడా పెట్టలేదు కాబట్టి తాము చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పగించడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమనీ, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని చంద్రబాబు నాయుడు, ఇతర ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ అనవసర జోక్యంగా చూపిస్తున్నారు. మరి అప్పుడు ఇది తమ పరిధిలోని అంశం కాదని ఎందుకు చెప్పినట్టు?
ఈ కేసును ఎలాగైనా పొడిగించి సానుభూతి రూపంలో రాజకీయ ప్రయోజనం పొందాలని వైసీపీ అధినేత ప్రయత్నిస్తున్నారు. దీనికి కేంద్రం మద్దతు కూడా ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు దగ్గర వ్యూహం లేనట్లుంది. రాష్ట్రంలో కేసు దర్యాప్తు పూర్తయినందున మళ్లీ విచారణ అవసరం లేదని హైకోర్ట్ బెంచ్‌కు, లేదా సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. కానీ ప్రయోజనం ఉండకపోవచ్చు. రాష్ట్రంలో విచారణ పూర్తయిన కేసును మళ్లీ విచారణ చేయడానికి కేంద్ర సంస్థలకు అధికారం ఉంది.