పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు. ఇతర పార్టీల్లో పేరున్న నేతలను పార్టీలో చేర్చుకోవడంపై ప్రస్తుతం ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు ఉంది. పొత్తులపై ఎక్కడా మాట్లాడటం లేదు. పొత్తుల కంటే ముందు జనసేన బలమైన పార్టీ అనే ఇమేజ్‌ని క్రియేట్ చేయడం పవన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. దీనివల్ల ఒకవేళ పొత్తు పెట్టుకుంటే మరిన్ని సీట్లు లభించే అవకాశం ఉంటుంది.
పొత్తుల విషయంలో పవన్‌కు ఉన్న అవకాశాలు ప్రస్తుతం పరిమితమే. ఒంటరిగా పోటీచేయాలనుకుంటే ఏ గొడవాలేదు. కాకపోతే సొంతంగా ఎన్ని సీట్లు సాధించగలం అనేది అంచనా వేసుకోవడం కష్టం. ఈ ఎన్నికల్లో సాధించే సీట్లను బట్టే జనసేన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లేకపోతే కోదండరామ్ తెలంగాణ జనసమితి పార్టీలా మిగిలిపోతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయడం గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిందే.
ఇక వైసీపీతో పొత్తు అసాధ్యం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య కింది స్థాయిలో కూడా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా హైపర్ ఆదిపై వైసీపీ కార్యకర్తల దాడి దీనికి నిదర్శనం. టీఆర్ ఎస్‌తో వైసీపీ సన్నిహితంగా ఉండటం కూడా పవన్ కళ్యాణ్‌కు పడటంలేదు. బహిరంగంగానే దీన్ని విమర్శించారు. అందువల్ల వైసీపీతో జనసేన పొత్తు లేనట్టే.
ఇక వామపక్షాలు ఉన్నా, సీట్లు గెలిపించలేని పరిస్థితి. జనసేన మీద వామపక్షాలు ఆధారపడుతున్నాయి గానీ, వామపక్షాల అండతో పవన్ సీట్లు గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల ఆ పార్టీతో వెళ్లడానికి కూడా పవన్ కళ్యాణ్ సాహసం చేయకపోవచ్చు.
ఎటొచ్చీ ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశంతో పొత్తు ఒక్కటే సాధ్యంగా కనిపిస్తుంది. టీడీపీ కూడా దీనికి సిద్ధంగా ఉన్నట్టు అనేక సంకేతాలు ఇప్పటివకే వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలి కాలంలో టీడీపీని, ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించిన సందర్భాలు లేవు. రెండు పార్టీలు ఏ మేరకు చొరవ తీసుకొని ప్రయత్నిస్తాయనే దాన్ని బట్టి వీరి పొత్తు ఆధారపడి ఉంటుంది.