ప్రియాంక మ‌రో ఇందిరా గాంధీ కాగ‌ల‌రా?

కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ క్రియాశీల పాత్ర‌పై అప్పుడే ర‌క‌ర‌కాల ఊహాగానాలు, వ్యాఖ్యానాలు వ‌స్తున్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్ తూర్పు ప్రాంతానికి ఇన్‌చార్జ్‌గా ప్రియాంక నియామ‌కం త‌ర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం క‌నిపించ‌డం స‌హ‌జ‌మే. కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ త‌ర్వాత అంత‌టి జనాక‌ర్ష‌క శ‌క్తి ఉన్న నేత లేర‌నే చెప్పాలి. సోనియా గాంధీ కూడా రాజీవ్ మ‌ర‌ణానంత‌రం పార్టీని నిల‌బెట్ట‌డంలో కీల‌క పాత్ర పోషించారు కానీ, అద్భుత జ‌నాక‌ర్ష‌ణ‌, వాక్చాతుర్యం లేవు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే జ‌నాక‌ర్ష‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉన్న ప్రియాంక ముందు ముందు దేశ రాజ‌కీయాల్లో కీల‌కం కానున్నారు.

ప్రియాంక గాంధీ రూపురేఖ‌లు, హావ‌భావాలు త‌న నాయ‌న‌మ్మ ఇందిరా గాంధీకి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. దేశ రాజ‌కీయాల్లో ఇందిరా గాంధీ చెర‌గ‌ని ముద్ర వేశారు. గ‌రీబీ హ‌ఠావో నినాదంతో పేద‌వారి కోసం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అందుకే ఇందిర‌మ్మ రాజ్యం అనే నినాదం ఇంకా వినిపిస్తుంది. దేశంలో శ‌క్తివంత‌మైన మ‌హిళా నేత‌గా ఇందిరా గాంధీని అంద‌రూ గుర్తించారు. ఇప్పుడు ప్రియాంక గాంధీని ఇందిరా గాంధీతో పోల్చుతున్నారు కాంగ్రెస్ అభిమానులు. ప్రియాంక ఏ మేర‌కు భార‌త రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ర‌నేది చూడాలి.

విధానాల ప‌రంగా ప్రియాంక గాంధీ వాక్చాతుర్యం, మాట తీరు, ప్ర‌తిప‌క్షాల‌ను తట్టుకోగ‌లిగే విధానం.. ఇవ‌న్నీ ప్రియాంక గాంధీ రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని నిర్ణ‌యించనున్నాయి. ఆమె గతంలో ప్ర‌సంగాలు చేసిన‌ప్ప‌టికీ వాటికి దేశవ్యాప్తంగా వాటికి ప్ర‌చారం ల‌భించ‌లేదు, చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. ఇక నుంచి ప్రియాంక ఏమి మాట్లాడినా జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతుంది. అందువ‌ల్ల ప్రియాంక గాంధీ నాయ‌క‌త్వ శైలికి, ఆక‌ర్ష‌ణ శ‌క్తికి కూడా రాబోయే ఎన్నిక‌లు ప‌రీక్ష కానున్నాయి.