ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఏపీ పర్యటనలో భాగంగా ప్రజాచైతన్య సభలో మాట్లాడిన నరేంద్ర మోదీ చంద్రబాబుపై నేరుగానే విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ పనితీరుపైనేగాక చంద్రబాబును వ్యక్తిగతంగా కూడా ప్రధాని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రధానంగా చంద్రబాబు సీనియారిటీ గురించి అనేక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికిపోయినా చంద్రబాబు నాకంటే సీనియర్ అని చెప్పుకుంటున్నారు… నిజమో.. మామను వెన్నుపోటు పొడవడంలో, కొడుకు కోసం అవినీతికి పాల్పడటంలో నాకంటే చంద్రబాబు సీనియర్ అని మోదీ విమర్శించారు. గతంలో విమర్శించినవారి పక్కన కూర్చోవడంలో కూడా చంద్రబాబు నాకంటే సీనియర్ అని కాంగ్రెస్, బాబు మైత్రి గురించి ఎద్దేవా చేశారు.
మోదీ విమర్శలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. మోదీ లేవనెత్తిన అంశాలు వ్యక్తిగతమైనవే తప్ప ప్రభుత్వ పనితీరు గురించి మోదీ చెప్పిన ప్రత్యేక అంశాలు ఏమీలేవు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు, టీడీపీ వాళ్లు చెప్పినట్టు అధికార మార్పిడి ఇప్పటి సంగతి కాదు. అది జరిగిన తర్వాత కూడా టీడీపీ రెండుసార్లు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇంకా దాన్ని ప్రజలు పట్టించుకునే దశలో ఉన్నారా అనేది సందేహమే.
ఇక లోకేష్ కోసం చంద్రబాబు లేదా టీడీపీ ప్రభుత్వం ఏదైనా అవినీతికి పాల్పడి ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు విచారణ జరపవచ్చు. ఇవన్నీ కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి కదా. గాలిలో విమర్శలు చేస్తే నమ్మే కాలంలో ప్రజలు ఉన్నారని భావించలేం. మోదీ మాట్లాడిన ప్రజా చైతన్య సభలో ప్రజల్ని చైతన్యపరిచే విషయాలేవీ ఆయన మాట్లాడలేదు. వ్యక్తిగత విమర్శలు మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తే ఏపీ ప్రజలు సంతోషిస్తారు. కొన్ని ఓట్లు పడతాయి.