ఇటీవలి వరకు రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ గల్లంతే అనే అభిప్రాయం అన్నిచోట్లా వినిపిస్తుండేది. 2014 ఎన్నికల్లో పరాజయం దగ్గర్నుంచి అనేక శాసన సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వరుసగా ఓటమి పాలవుతూ వస్తుండటం రాహుల్ గాంధీ నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు కూడా సందేహాలను మిగిల్చింది. అయితే ఏడాది నుంచి చిత్రం పూర్తిగా మారిపోయింది. రాహుల్ గాంధీ ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, మాట తీరు, హావభావాలు.. ఇలా అన్నిటిలో మార్పు వచ్చింది. దీనికితోడు రాజకీయ ప్రసంగాల్లో, విమర్శల్లో పరిణతి చాలా కనిపిస్తుంది.
ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రచారం తీరు పరిశీలించిన వారికి తేడా స్పష్టంగా తెలిసుంటుంది. బీజేపీ ప్రభుత్వాన్ని, మోదీని విమర్శించడంలో వాడి వేడి ప్రదర్శించారు. ముఖ్యంగా రాఫెల్ యుద్ధ విమానాల వివాదంలో పట్టు విడవకుండా, పార్లమెంట్ దగ్గర్నుంచి గల్లీ వరకు బాణాలు ఎక్కుపెట్టారు. అత్యంత కీలకమైన మూడు రాష్ట్రాల్లో విజయంతో రాహుల్ గాంధీ నాయకత్వంపై గతంలో ఉన్న అభిప్రాయాలు చాలావరకు మారిపోయాయి. బీజేపీ కూడా గతంలో మాదిరిగా తేలిగ్గా తీసుకోవడం లేదు.
అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా ఎన్నికల భేరిని మోగించిన బీజేపీకి రాహుల్ గాంధీ గట్టి పోటీనిచ్చే వాగ్దానం చేశారు. దేశంలోని ప్రజలందరికీ కనీసం ఆదాయం సమకూర్చే పథకం ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా దీనిపైకి చర్చ మళ్లింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ మరో అడుగు ముందుకేసి తన రాష్ట్రం నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో బీజేపీ మరో అస్త్రం వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రైతు రుణ మాఫీ, వడ్డీ రాయితీ అంశాల్లో కూడా రాహుల్ గాంధీ బీజేపీకి నిదరపట్టనీయడం లేదు. మొత్తానికి బడ్జెట్లో బీజేపీ ఏదో ఒక భారీ పథకం, ప్రకటన చేస్తే తప్ప రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకాన్ని ఎదుర్కోవడం కష్టమనే చెప్పవచ్చు.