హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో వెలుగు చూసిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది. ఓ మైనర్ బాలుడు చుట్టుపక్కల ఉండే హాస్టళ్ల అమ్మాయిలు స్నానం చేస్తుండగా వీడియోలు తీయడం హాస్టళ్లలో అమ్మాయిల భద్రతకు సవాలుగా మారింది. ఒకటీ అరా కాదు.. ఏకంగా మూడువేల వీడియోలు ఆ బాలుడి ట్యాబ్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ సంఘటన హాస్టళ్లలో అమ్మాయిల భద్రతకు నిర్వాహకులు కనీస చర్యలు తీసుకోకపోవడాన్ని వెలికితీసింది. దాదాపు ఆర్నెళ్ల నుంచి ఈ బాలుడు అమ్మాయిల వీడియోలు తీస్తున్నట్టు గుర్తించారు. డిసెంబరు 16న ఒక అమ్మాయి స్నానం చేస్తుండగా కిటికీ దగ్గర శబ్దం రావడంతో అప్రమత్తమై చుట్టుపక్కల చూసింది. పక్కనే ఉన్న ఇంటి బాల్కనీ నుంచి ఒక అబ్బాయి చేతిలో ట్యాబ్‌తో పారిపోవడం చూసి హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చింది. వాళ్లు ఆ బాలుడిని విచారించి ట్యాబ్ చూడటంతో అసలు విషయం బయట పడింది. దీంతో పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు.
8వ తరగతి చదువుతున్న ఆ బాలుడిని పోలీసులు విచారించగా దాదాపు ఆరు నెలలనుంచి వీడియోలు తీస్తున్నట్టు ఒప్పుకున్నాడు. ఈ సంఘటన పేరెంట్స్‌కు కూడా గుణపాఠం నేర్పే విధంగా ఉంది. పిల్లలకు సరదాల కోసం కొనిచ్చే ఫోన్‌లు, ట్యాబ్‌లు దుర్వినియోగం అయితే ఎంత ప్రమాదకరమో దీన్ని బట్టి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవచ్చు.