అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ ఎండీ, ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్ మర్డర్ మిస్టరీ దాదాపు వీడినట్టే. జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ఈ హత్యలో కీలకపాత్ర పోషించినట్టు అర్థమవుతోంది. కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు శిఖా చౌదరిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి కొన్ని గంటలుగా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా కుటుంబ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు జయరామ్ హత్యకు కారణాలు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్య జరిగిన జనవరి 30 రోజు రాత్రి శిఖా చౌదరి కదలికలను పోలీసులు కూపీ లాగారు. ఆరోజు అర్థరాత్రి వరకు శిఖా చౌదరి ఇంట్లో లేనట్టు పోలీసుల విచారణలో తేలింది. శిఖా చౌదరి, జయరామ్ మధ్య ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. జయరామ్ హత్యలో రాకేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చినట్టు సమాచారం. శిఖా సోదరి మనీషాను కూడా పోలీసులు విచారించినట్టు సమాచారం.
అంతేగాక జయరామ్ కారు డ్రైవర్లు, గన్‌మెన్, ఇతర కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. హత్య జరిగిన తీరుపై కూడా పోలీసులు దాదాపు ఒక నిర్థారణకు వచ్చారు. జయరామ్‌పై విష ప్రయోగం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే జయరామ్ బస చేసిన దసపల్ల హోటల్ రూమ్ ఒక మహిళా యాంకర్ పేరు మీద ఉన్నట్టు వార్తలొచ్చాయి. మొత్తం మీద మరికొన్ని గంటల్లోనే ఈ హత్య కేసు మిస్టరీ వీడే అవకాశం ఉంది.