అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యాపార వేత్త చిగురుపాటి జయరామ్ హత్య విచారణ గందరగోళంగా మారింది. నిందితులుగా అనుమానిస్తున్న శిఖా చౌదరి, రాకేశ్ రెడ్డి ఒకరికొకరు పొంతన లేని సమాధానాలు చెప్పడం, జయరామ్ భార్య తనకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పడం, రకరకాల ఒత్తిళ్లతో, ఆధారాలతో పోలీసులు ఒక నిర్దారణకు రాలేకపోవడం మొత్తం ఉదంతాన్ని నీరుగార్చేలా కనిపిస్తుంది.
రెండు రోజులుగా శిఖా చౌదరిని విచారిస్తున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి కీలక సమాచారం లభించలేదు. తమ మధ్య అక్రమ సంబంధం ఉందనీ, ఆస్తుల వివాదాలు ఉన్నాయని శిఖా చౌదరి చెప్పింది, కానీ జయరామ్ హత్యతో తనకు సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. విచారణ సందర్భంగా తన అలవాట్లు, జీవన విధానం చెప్పింది.
మరోవైపు రాకేష్‌రెడ్డి కూడా విచారణలో తనకు, శిఖా చౌదరికి ఉన్న సంబంధం గురించి చెప్పినట్టు వార్తలొచ్చాయి. కానీ జయరామ్ హత్య గురించి పోలీసులకు కీలక సమాచారం లభ్యమైందా లేదా అనేది వెల్లడి కాలేదు. మరోవైపు ఈ వ్యవహారంలో సినిమా రంగానికి చెందిన పెద్దలు కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. కబాలి సినిమా తెలుగు నిర్మాత కేపీ చౌదరి శిఖాను విచారిస్తున్న సమయంలో కలిసి రావడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఓ టీవీ యాంకర్‌ను జయరామ్‌కు ఎరగా వేసి హత్యకు ప్రణాళిక వేసినట్టు రాకేష్‌రెడ్డి చెప్పాడని వార్తలు వచ్చాయి. మరి అంత కచ్చితంగా చెప్పినప్పుడు అతన్ని నిందితుడిగా పోలీసులు ఇంతవరకు వెల్లడించలేదు. విచారణ సాగదీస్తూ కొనసాగుతూ ఉండటం వల్ల జనాల్లో సాధారణంగానే ఈ హత్యపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశాలు కనిపించడం లేదు.