డాల‌ర్ డ్రీమ్స్ చెదిరిన వేళ‌.. చిక్కుల్లో తెలుగు విద్యార్థులు

అమెరికాలో తెలుగు విద్యార్థుల అరెస్టుల క‌ల‌క‌లం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎలాగైనా అమెరికాలో తిష్ట వేయాల‌నే ఉద్దేశంతో అక్క‌డి వీసా నిబంధ‌న‌ల‌ను స‌రిగా పాటించ‌కుండా, న‌కిలీ యూనివ‌ర్సిటీల్లో విద్యార్థులుగా చేరి తెలుగు విద్యార్థులు మోస‌పోతున్నారు. సుమారు రెండేళ్ల కింద‌ట 21 మంది తెలుగు విద్యార్థుల‌ను అరెస్టు చేశారు. ఆ కేసు ఇంకా తెమ‌ల‌క‌ముందే మ‌ళ్లీ అలాంటి సంఘ‌ట‌నే చోటుచేసుకోవ‌డం ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఆయా విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లో ఉన్నారు.

ఈసారి దాదాపు 600 మంది వ‌ర‌కు విద్యార్థులు ఈ వీసా కేసులో ఇరుక్కున్న‌ట్టు స‌మాచారం. అక్ర‌మంగా ఉండాల‌నుకుంటున్న వారికి ఏరివేసే ఉద్దేశంతో అమెరికా ప్ర‌భుత్వం అధికారికంగా ఒక నకిలీ యూనివ‌ర్సిటీని సృష్టించి ద‌ళారుల‌కు, విద్యార్థుల‌కు వ‌ల‌వేసి ప‌ట్టుకోవ‌డం ఇందులో సంచ‌ల‌నంగా మారింది. అమెరికాలో చ‌దువు, ఉద్యోగం కోసం వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని భావించిన అమెరికా ఇమ్మిగ్రేష‌న్ అధికారులు ముందుగా 8 మంది ద‌ళారుల‌ను అరెస్టు చేశారు. వీరు…. భరత్‌ కాకిరెడ్డి, సురేశ్‌ కందల, ఫణిదీప్‌ కర్ణాటి, ప్రేమ్‌ రామ్‌పీస, సంతోష్‌ సామ, అవినాశ్‌ తక్కళ్లపల్లి, అశ్వంత్‌ నునె, నవీన్‌ ప్రత్తిపాటి.

వీరి స‌హాయంతో న‌కిలీ యూనివ‌ర్సిటీలో చేరిన 600 మంది విద్యార్థుల ఆచూకీ కోసం ప్ర‌స్తుతం యూఎస్ అధికారులు వెతుకుతున్న‌ట్టు స‌మాచారం. వీరిలో కొంత మంది నిజంగా అర్హ‌త‌లున్న విద్యార్థులు కూడా ఉన్న‌ట్టు తెలిసింది. వీరిని దొరికిన వారిని దొరికిన‌ట్టు ఇండియాకు పంపించే అవ‌కాశం ఉంది.

ఈ ఆప‌రేష‌న్ కోసం అమెరికా అధికారులు మిషిగన్‌ రాష్ట్రంలోని ఫార్మింగ్‌టన్‌ హిల్స్‌లో ‘ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయం’ పేరుతో ఒక నకిలీ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేశారు. వెబ్‌సైట్‌లో ఈ స‌మాచారం ఉంచారు. ఇది న‌కిలీద‌న్న విషయం తెలుసుకోలేని 8 మంది నిందితులు ఈ సంస్థ‌లో ఏకంగా 600 మందికిపైగా విద్యార్థులను చేర్చ‌డానికి ప్ర‌య‌త్నించారు. వీరిలో ఎక్కువ‌మంది విద్యార్థి ముసుగులో అమెరికాలో ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు అధికారులు గుర్తించారు. వీరిని విచారించి వెన‌క్కి పంపిస్తారా లేక‌పోతే అమెరికా చ‌ట్టాల ప్ర‌కారం ఇంకా ఏమైనా శిక్ష‌లు ఉంటాయా అనేది చూడాలి.