తెలుగు వార్తా రంగంలో సంచలనం టీవీ 9. అనతికాలంలోనే అగ్రస్థానానికి చేరిన టీవీ9 వెనుక ప్రధాన వ్యక్తి రవి ప్రకాష్. ఎన్‌కౌంటర్ ప్రోగ్రామ్‌తో ప్రారంభమైన రవి ప్రకాష్ ప్రస్థానం టీవీ 9 సీఈఓ స్థాయికి చేరింది. తాజా పరిణామాల నేపథ్యంలో రవి ప్రకాష్ మరోసారి వెలుగులోకి వచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో టీవీ 9 రవి ప్రకాష్ పేరు తెలియని వారుండరు. టీవీ9లో 9 గంటలకు ప్రసారమయ్యే రవి ప్రకాష్ బులెటిన్‌ను చాలామంది తప్పనిసరిగా ఫాలో అయ్యేవారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో రవి ప్రకాష్ అడిగే ప్రశ్నలు సూటిగా, ఎదుటివారిని ఇబ్బందిపెట్టేవిగా, నిజాలను బయటపెట్టేవిగా ఉంటాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత టీవీ9 యాజమాన్యంలో మార్పులు వచ్చాయి. ప్రముఖ వ్యాపార వేత్త జూపల్లి రామేశ్వరరావు టీవీ9లో మెజారిటీ వాటాను కొన్నారు. అయితే 8 శాతం వాటా ఉన్న రవి ప్రకాష్ తమను కంపెనీ నిర్వహణలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని మెజారిటీ వాటాదారుల ఆరోపణ. దీనికి తోడు యాజమాన్యంలో కీలకమైన డైరెక్టర్ల నియామకం విషయంలో రవి ప్రకాష్ ఫోర్జరీకి పాల్పడ్డారని కేసు నమోదైంది.
మీడియాలో రకరకాల కథనాలు వచ్చినప్పటికీ టీవీ9లో రవి ప్రకాష్ కనిపించేసరికి ఆ కథనాల్లో నిజానిజాలపై అనుమానాలు తలెత్తాయి. రవిప్రకాష్ కోసం పోలీసులు నిజంగానే వెతుకుతుంటే, ఆయన టీవీలో కనిపించి వార్తలు ఎలా చదువుతారు? కంపెనీ లా ట్రిబ్యునల్ కేసు విచారణలో ఉన్నందున మీడియా హడావిడి చేసిందని స్వయంగా రవి ప్రకాషే చెప్పారు. తనను ఎవరూ అరెస్టు చేయలేదని, చేయరని కూడా చెప్పడం విశేషం.