సినిమా, టీవీ రంగాలకు చెందిన తారలు ఇటీవల కాలంలో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమ వ్యవహారాలే వీటికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. పేద కుటుంబం నుంచి హైదరాబాద్ వచ్చి టీవీ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ బలవన్మరణం తాజాగా అందరినీ కలచివేసింది. ఆమె తల్లిదండ్రులు సాధారణ రైతు కూలీలు. బతుకుదెరువు కోసం మూడేళ్ల కిందట వచ్చి తక్కువ కాలంలో నటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ప్రేమ రూపంలో ఆమెను విధి కాటేసింది.
ఝాన్సీకి ఏడాది కిందట సూర్య తేజ చౌదరి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే ఝాన్సీ ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఝాన్సీపై అనుమానం పెంచుకున్న సూర్య తేజ వేధించడం మొదలుపెట్టడంతో ఝాన్సీ ఒత్తిడికి లోనయింది. పెళ్లికి అంగీకరించి మరోవైపు అనుమానాలు, వేధింపులు ఎక్కువవుతుండటంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
అయితే ఝాన్సీ బలవన్మరణానికి ముందు ఒక సెల్ఫీ వీడియో తీసినట్టు వార్తలొచ్చాయి. కానీ పోలీసుల విచారణ సందర్భంగా ఆమె ఫోన్‌లోని మెసేజ్‌లు, చాట్‌లు మాయం అయినట్టు సమాచారం. ఇది ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది. కేసు విచారణలో పోలీసులపై ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. సూర్య తేజ ఎవరనే విషయం కూడా ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఝాన్సీ తండ్రి మాట్లాడుతూ ఒకసారి అతను ఎవరో తమకు తెలియదనీ, మరోసారి తమకు దూరపు బంధువు అవుతారనీ చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ కేసు వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది.