ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు విచారణ ఇప్పట్లో తెమిలేలా కనిపించడం లేదు. ప్రధాన నిందితుడుగా భావిస్తున్న రాకేష్ రెడ్డి నెట్వర్క్ భారీగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. తెలంగాణ, ఏపీలో పోలీసు ఉన్నతాధికారులు, హైదరాబాద్‌లో రౌడీ షీటర్లు, పబ్‌లు, అమ్మాయిల నెట్వర్క, సినిమా రంగంలోని ప్రముఖులతో రాకేష్ రెడ్డికి పరిచయాలు… ఇవన్నీ కలిసి ఈ విచారణను మరింత ఆలస్యం చేసే అవకాశం ఉన్నాయి. అదే సమయంలో చాలామంది కీలకవ్యక్తులు కూడా ఉంటే… పక్కదారి పట్టే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.
కేసు విచారణలో ఏపీ పోలీసుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కేసును త్వరగా తేల్చాలనో, లేక ఇతరత్రా ఒత్తిళ్ల వల్లనో ఏపీ పోలీసులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొన్ని విచారణ ముగించారు. కానీ తెలంగాణకు కేసు ట్రాన్స్ఫర్ అయ్యాక ఇందులో మరిన్ని కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రాకేష్‌రెడ్డి పాత్ర, రౌడీ షీటర్ల ప్రమేయం, అప్పులు, ఆస్తుల వ్యవహారం తవ్వేకొద్దీ కొత్త విషయాలు బయటికొస్తున్నాయి.
ఈ హత్య కేసులో హైదరాబాద్ పోలీసుల ప్రమేయం కూడా చాలా ఉన్నట్టు సమాచారం దాదాపు 11 మంది పోలీసు అధికారులను (ఏసీపీ, ఇన్స్పెక్టర్ స్థాయి) తెలంగాణ విచారణ బృందం విచారించింది. అలాగే అనేక మంది రౌడీషీటర్లను కూడా విచారించింది. నగేష్ అనే వ్యక్తిని కూడా నిందితుడిగా తేల్చినట్టు సమాచారం.
మరోవైపు శిఖా చౌదరి పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ పోలీసులు కూడా విచారించినప్పటికీ, ఆమె పాత్ర ఏమేరకు ఉందనేది పోలీసులు ఏమీ వెల్లడించలేదు. ఇంకా విచారణ కొనసాగుతున్నందున సమయం పట్టవచ్చు. మొత్తం మీద ఈ కేసు వ్యవహారంలో ఏపీ పోలీసులు కొంత అలసత్వం ప్రదర్శించారనేది తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.