ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణలో కేసీఆర్ వ్యూహాన్ని ఫాలో అవుతూ నోటిఫికేషన్ కంటే బాగా ముందుగానే ఒకేసారి 70 మంది అభ్యర్థులను ప్రకటించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కూడా దాదాపు లేనట్టే. కాంగ్రెస్ నాయకులకు ఇది అర్థమైనట్టుంది. సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఎటొచ్చీ అర్థం కాకుండా ఉంది… వైసీపీ, జనసేన, ఇతర పార్టీల పొత్తులే. ప్రస్తుతానికైతే వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. రెండు పార్టీల నేతలు పరస్పర వ్యక్తిగత దూషణలకు దిగడం చూస్తే వారి మధ్య పొత్తు అసాధ్యం అనిపిస్తుంది. కానీ రాజకీయాల్లో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ట్ ఆఫ్ పాజిబుల్.
అంతేగాక వైసీపీ, జనసేన ఇద్దరి శత్రువు టీడీపీనే. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు కావచ్చు. మరోవైపు టీడీపీని ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈసారి ఎన్నికల్లో ఆరునూరైనా చంద్రబాబు మళ్లీ గెలవకుండా ఉండటానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేయనుంది. అందులో భాగంగా జనవరిలోనే ప్రధాన పర్యటనలను ఖరారు చేసింది.
టీడీపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, జనసేనలను ఏకం చేసే బాధ్యత కూడా బీజేపీ నెత్తికెత్తుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీపై బీజేపీ ఈ బాధ్యతలను పెట్టినట్టు చెబుతున్నారు. ప్రధాని పర్యటన ద్వారా మరింత రాజకీయ వేడి రాజేసి, వారిద్దరిని ఏకం చేయడం బీజేపీ లక్ష్యంగా విశ్లేషకులు చెబుతున్నారు.