విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి చేసి జైలులో ఉన్న నిందితుడు శ్రీనివాసరావు జైలులో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నట్టు సమాచారం. వైజాగ్ సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాసరావుకు భద్రత, ఇతర విషయాల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ లభిస్తున్నట్టు తెలిసింది. అతని బాగోగులను జైలు ఉన్నత అధికారులు ప్రత్యేకంగా చూసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.
వేరే రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఖైదీలు జైలులో శ్రీనివాసరావుకు సేవకులుగా పనిచేస్తున్నారు. బీహార్‌కు చెందిన జలీల్, భాయ్, ఒడిషాకు చెందిన మిథుల్ అనే ఖైదీలు శ్రీనివాసరావు గది శుభ్రం చేయడం, అతనికి అవసరమైన ఆహారం తీసుకురావడం వంటివి చేస్తున్నట్టు సమాచారం. దీనికి ప్రతిగా ఈ ఖైదీలకు రోజూ మాంసాహారం ఇస్తున్నారట.
అంతేకాదు… కోడి కత్తి కేసు నిందితుడికి రక్షణగా నలుగురు పోలీసులను నియమించారట. శ్రీనివాసరావును ఎవరు పడితే వారు కలిసే అవకాశం కూడా లేదట. రక్షణగా ఉన్న నలుగురు పోలీసులు, అతనికి సేవలందిస్తున్న ముగ్గురు ఇతర ఖైదీలు, జైలు ఉన్నతాధికారులు తప్ప ఎవరినీ శ్రీనివాసరావును కలవడానికి అనుమతించడం లేదని సమాచారం.
జైలులో శ్రీనివాసరావు రచయితగా కూడా మారాడు. జగన్ మీద తనకున్న అభిమానం, ఇతర అంశాల గురించి ఏదో పుస్తకం కూడా రాసినట్టు సమాచారం. దీన్ని ప్రచురించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.