మొత్తానికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం కొత్త వివాదాలకు తెరదీస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా గంటపాటు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో చంద్రబాబులో భారీ కదలికే వచ్చింది. సాధారణంగా చిన్న చిన్న విమర్శలకు చంద్రబాబు స్పందించరు. అలాంటిది తనకు అంతగా అలవాటు లేకపోయినా కొంత పంథా మార్చుకొని కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.
నాయకుడు కాదు… మేనేజర్
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశాన్ని చంద్రబాబు లాక్కున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఆయనకు అసలు పార్టీనే లేదని, నాయకుడు కూడా కాదనీ, మేనేజర్ మాత్రమేనని విమర్శించారు. దీనికి ప్రతిగా ఏపీకి చెందిన నలుగురైదుగురు మంత్రులు స్పందించారు. దీంతో చంద్రబాబు నాయుడు స్పందించడేమో అనుకున్నారు. కానీ శ్వేతపత్రం విడుదల చేస్తూ కేసీఆర్ మీద బాగనే ఆరోపణలు చేశారు.
వైశ్రాయ్ సిద్ధాంతకర్త ఆయనే
చంద్రబాబు విమర్శల్లో అత్యంత కీలకమైంది, వివాదాస్పదమైంది…. వైశ్రాయ్ సంఘటన. ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో ఆ సంఘటనే కీలక మలుపు. ఎమ్మెల్యేల మద్దతు కోసం ఎన్టీఆర్ అక్కడకు వెళ్లినప్పుడు హోటల్‌లో నుంచి ఆయన మీద చెప్పులు కూడా విసిరారు. దీంతో ఎన్టీఆర్ తీవ్రంగా కలతచెంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పదవీచ్యుతి, చంద్రబాబుకు అధికారం… అందరికీ తెలిసినవే. అయితే ఈ వైశ్రాయ్ ఎపిసోడ్‌కు సూత్రధారి కేసీఆరే అని చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ల తర్వాత అనడం సంచలనంగా మారింది.
మరి చెప్పులు వేయించే సిద్ధాంతం ఎవరిది?
చంద్రబాబు నాయుడు మాటల్లో…. ఎన్టీఆర్ నుంచి నేను పార్టీని లాక్కున్నానని అంటున్నారు, అప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడున్నారు? వైశ్రాయ్ ఎపిసోడ్ సిద్ధాంతకర్త ఆయనే కదా, మొత్తం నడిపించిందే ఆయన… అన్నారు. దీనికి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించింది కూడా ఎవరో చెబితే ఒక పని అయిపోతుంది. చూద్దాం… ఈసారి మళ్లీ కేసీఆర్ బయటికొచ్చి చెబుతారేమో. మొత్తానికి వీరిద్దరి మధ్య వివాదం వల్ల ఎన్టీఆర్ జీవితం, తెలుగుదేశంలో ఆనాటి సంక్షోభం గురించి కొత్త నిజాలు వెలుగులోకి వస్తే మంచిదే.