చంద్ర‌బాబు వైశ్రాయ్ సంఘ‌ట‌న ప్ర‌స్తావ‌న‌తో టీడీపీ డిఫెన్స్‌లో పడిందా?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై విమ‌ర్శ‌లు, తిట్ల‌తో ఊగిపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చాలా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కానీ కొంచెం వెన‌క్కి వెళ్లి ఆలోచిస్తే కేసీఆర్‌కు ఆ మాత్రం కోపం రావ‌డంలో త‌ప్పు లేద‌నిపిస్తుంది. తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు నాయుడు ప‌ని చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎలాగైనా టీఆర్ఎస్‌ను ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టారు. హైద‌రాబాద్‌లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడిపై కేసీఆర్‌కు కోపం రావ‌డంలో త‌ప్పేముంది?

మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే… అంద‌రూ కేసీఆర్ వాడిన భాష మీద‌నే అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు త‌ప్ప విషయంతో విభేదిస్తున్న‌వారు క‌నిపించ‌డం లేదు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కూడా ఆ భాష ఏంటి, తిట్లు ఏంటీ అంటున్నారు త‌ప్ప మాట్లాడిన దానికి గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చే స్థితిలో లేరు. లేక‌పోతే కేసీఆర్‌ను ఉద్దేశించి నీ రాజ‌కీయ చ‌రిత్ర ఎక్క‌డ మొద‌లైంది అంటున్నారు.

చివ‌రికి చంద్ర‌బాబు నాయుడు కూడా వైశ్రాయ్ ఎపిసోడ్ సిద్ధాంత‌క‌ర్త‌వు నువ్వే క‌దా అని సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. దాని మీద ఎక్కువ చర్చ జ‌రిగితే చంద్ర‌బాబు నాయుడుకి, టీడీపీకే న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. ఎన్టీఆర్‌పై అభిమానాన్ని రెచ్చ‌గొట్టి, నంద‌మూరి కుటుంబానికి ఎంతోకొంత ఇబ్బంది క‌లిగించేలా మాట్లాడి, వైసీపీ దీన్ని ఒక అస్త్రంలా వాడుకోవ‌చ్చు.

ఇందులో టీడీపీ వ్యూహం కూడా లేక‌పోలేదు. కేసీఆర్ మీద ఏపీలో మ‌రింత చ‌ర్చ జ‌ర‌గ‌డం ద్వారా జ‌గ‌న్‌ను కూడా ఇబ్బందుల్లోకి నెట్టాల‌నే వ్యూహం టీడీపీకి ఉండొచ్చు. జ‌గ‌న్ ఈ వ్య‌వ‌హారంపై ఆచితూచి స్పందిస్తున్న‌ప్ప‌టికీ తెలంగాణ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు వైసీపీ స‌హకారం, ఏపీలో వైసీపీ నేత‌ల విజ‌య సంబ‌రాలు, ఫ్లెక్సీలు వంటివి వైసీపీని ఇబ్బందిపెట్టేవే.