తెలుగుదేశం పార్టీ ఎన్నికల భేరి మోగించింది. ఫిబ్రవరి నెలాఖర్లో లేదా మార్చి మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధం అవుతుంది. ఇదివరకటిలా కాకుండా ఈసారి మరింత అగ్రెసివ్‌గా ఎన్నికల బరిలోకి దిగాలని టీడీపీ యోచిస్తోంది. ఇందులో భాగంగా నోటిఫికేషన్‌కు వెలువడటానికి నెల రోజులు ముందే అభ్యర్థుల ప్రకటనకు ప్లాన్ చేస్తుంది.
60-70 మందితో తొలి జాబితా
సంక్రాంతి పండగ తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో 60 నుంచి 70 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత దశల వారీగా మిగతా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ అనుసరించిన వ్యూహాన్నే తెలుగుదేశం ఏపీలో అమలు చేయనుంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనుకోవడం అందులో భాగమే. అలాగే సంక్షేమ పథకాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
తొలి జాబితా రూపకల్పనలో పార్టీ నాయకత్వం ప్రస్తుతం తలమునకలై ఉంది. ప్రతి జిల్లాలో కనీసం 6-7 మంది అభ్యర్థులను ఖరారు చేయడం లక్ష్యంగా కసరత్తు సాగుతోంది. ప్రాంతాలు, సామాజిక సమీకరణలు బేరీజు వేసుకొని దీన్ని రూపొందిస్తున్నారు.
మరోవైపు ప్రచారంపై కూడా దృష్టిపెట్టారు. ఈనెల 30న రాజమండ్రిలో జయహో బీసీ పేరుతో భారీ సదస్సు జరపాలని భావిస్తున్నారు. ప్రతివారం కనీసం 10వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని, తద్వారా వీలైనంత ఎక్కువమంది నాయకులతో టచ్‌లో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.