ఏపీలో 2019లో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పొత్తులపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీల నాయకులతోపాటు ఇతర పార్టీల నాయకులు కూడా ఎవరికి తోచిన అభిప్రాయం, వ్యాఖ్యానాలు దీనిపై చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సబ్బం హరి దీనిపై మరింత క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించారు.
తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధిస్తుందనీ, దీని ప్రభావం వల్ల ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్ కలిసే ఎన్నికలకు వెళతాయని సబ్బం హరి చెప్పారు. ఇది జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక మలుపు కానుందనీ, నరేంద్ర మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని అయ్యే అవకాశాలు లేవని తేల్చారు. అన్నిటికీ కీలకం తెలంగాణలో ఎన్నికల ఫలితాలే అన్నారు.
తెలంగాణలో టీఆర్ ఎస్ గెలవదు….. కానీ ఒకవేళ టీఆర్ ఎస్ గెలిస్తే మాత్రం చంద్రబాబు నాయుడుకు ఏపీలో, రాజకీయ జీవితంలో కష్టాలు మొదలవుతాయని సబ్బం హరి చెప్పారు. తెలంగాణలో టీఆర్ ఎస్ గెలిస్తే కేంద్రంలో మోదీకి కూడా తిరుగుండదని చెప్పారు.