జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికాలో యాత్రలో ఉన్నారు. పార్టీ ముఖ్యనేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి యూఎస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇంకా ఎవరికీ నిర్దిష్టంగా తెలియలేదు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నిధుల సేకరణే లక్ష్యంగా పర్యటన చేస్తున్నట్టు వినికిడి.
జనసేన వర్గాలు మాత్రం ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ నేత అమెరికా వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. ఇది వినడానికి కొంచెం విడ్డూరంగానే ఉంది. పెట్టుబడుల కోసం వెళ్తే గిళ్తే అధికార పార్టీ లేదా ప్రభుత్వంలో ఉన్నవాళ్లు వెళ్లాలి గానీ, అధికార పార్టీని వ్యతిరేకించేవాళ్లు వెళ్లడం అరుదు.
నాదెండ్ల మనోహర్‌తో కలిసి వాషింగ్టన్ డి.సి.లో పర్యటించారు. అక్కడి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీని కలుసుకున్నారు. ఏపీలో వెనుకబడిన జిల్లాల గురించి, అక్కడ పెట్టుబడి అవకాశాల గురించి వాళ్లు చర్చించుకున్నట్టు జనసేన అభిమానులు చెబుతున్నారు.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహం దగ్గర పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సెల్ఫీలు దిగారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో వీటిని పోస్ట్ చేశారు. పనిలోపనిగా అమెరికా నుంచే ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక ఉత్తరం కూడా కొట్టారు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పల పట్ల భారతీయుల ఆందోళనకు తన మద్దతు, సానుభూతి ప్రకటిస్తూ, ప్రధాని జోక్యం కోరుతూ పీఎంఓకు పవన్ లేఖ రాశారు.