ఏపీలో మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్లెక్సీ వెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దీన్ని ఏర్పాటు చేయడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులు తమ అధినేత వై ఎస్ జగన్, కేసీఆర్ కలిసి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో రాజకీయంగా ఏపీలో ఆసక్తి నెలకొంది.
తాజా ఫ్లెక్సీని శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. మధ్యలో జగన్, అటు ఇటు శిల్పా, కేసీఆర్ ఉన్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. కర్నూలు జిల్లా నంద్యాల – బండి ఆత్మకూరు రహదారిలో ఇది ఉండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. గతంలో తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలిచినప్పుడు ఏపీలో వైఎస్ఆర్ పార్టీల నేతలు సంబరాలు జరిపారు. కేసీఆర్ వైజాగ్ పర్యటనలో కూడా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
వైసీపీ అధినాయకత్వం ఈ ఫ్లెక్సీలపై ఎలాంటి వ్యతిరేకత చూపించి మందలించిన దాఖలాలు లేవు. దీంతో వైసీపీ – టీఆర్ ఎస్ మైత్రి దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ దీన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబుపై కేసీఆర్ విమర్శల ద్వారా టీడీపీ ఎంతోకొంత మైలేజీ పొందింది.
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత ఎక్కువగా ఇన్‌వాల్వ్ అయితే అంత మంచిదన్న అభిప్రాయంలో తెలుగుదేశం నాయకులు ఉన్నట్టున్నారు. దీనివల్ల వైసీపీ – బీజేపీ – కేసీఆర్ ముగ్గురి సంబంధాలను బయటపెట్టవచ్చని, బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వైసీపీ మీద కూడా పడుతుందని వారి అంచనా.