పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. ఏడాది నుంచి కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో అధికార పక్షంపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో యాత్ర చేస్తూ కేసీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధాన్ని ప్రస్తావించారు. హోదా విషయంలో ఏపీ సీఎం కేసీఆర్ మద్దతు తీసుకోవాలని, తద్వారా మనకు 42 మంది ఎంపీలైతే హోదా సాధించడం తేలికని చెప్పారు.
పవన్ కళ్యాణ్ చెప్పేవి పాత సమస్యలే:
పవన్ కళ్యాణ్ మీద కూడా జగన్ విమర్శలు కురిపించారు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలనే పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నారనీ, ఆయన కొత్తగా కనుక్కున్నది ఏమీ లేదని అన్నారు. ఇది మంచిదే కదా జగన్ గారూ. ఎప్పటి నుంచో సమస్య అలాగే ఉందంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే కదా. అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు పార్ట్‌నర్స్ అన్నారు. అవసరమైనప్పుడు ఇద్దరూ బాగా సహకరించుకుంటారని చెప్పారు.
పింఛను 10 వేలు:
వైసీపీ అధికారంలోకి ఉద్దానం బాధితులకు పింఛను రూ.2500 నుంచి రూ.10 వేలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంలో సినిమా స్టయిల్‌లో…. జగన్ అనే నేను, మీ అందరికీ హామీ ఇస్తున్నాను అన్నారు. అలాగే తిత్లీ, కిడ్నీ బాధితులకు సాయం పెంచుతామన్నారు. చంద్రబాబు ప్రారంభించిన ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం గేట్లు ఎన్నికల కోసమే అని ఎద్దేవా చేశారు.