వైజాగ్ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జగన్‌పై దాడి జరిగిన ప్రదేశం కేంద్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి కేంద్ర సంస్థ చేత విచారణ జరిపించాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరడంతో హైకోర్టు దీనికి అంగీకరించింది.
మరోవైపు ఎన్ఐఏ ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించడం విశేషం. కోర్టు తీర్పు వెలువడక ముందే తాము ఈ కేసు విచారణను చేపడుతున్నట్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. జనవరి 1వ తేదీనే ఎన్ఐఏ హైదరాబాద్ శాఖ ఈ మేరకు కేసు నమోదు చేయడం విశేషం. ఈ విషయాన్ని కేంద్రం ఏపీ హైకోర్టుకు కూడా తెలిపింది.
సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత సీఐఎస్ఎఫ్ దీనిపై కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు విచారణలో ఈ సంఘటన సంచలనం కోసమే జరిగిందని, హత్యాయత్నం కాదని తేలింది. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై తమక నమ్మకం లేదనీ, కేంద్ర సంస్థ పరిధిలో విచారణ జరిపించాలని జగన్ న్యాయవాదులు కోరడంతో హైకోర్టు దీనికి సమ్మతించింది.
ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మరో విశేషం. ఒకవైపు కోర్టులో వాదనలు పూర్తికాక ముందే కేంద్రం ఎన్ఐఏకు మార్గనిర్దేశం చేసింది. మొత్తంగా ఈ సంఘటన పూర్తిగా రాజకీయం అయింది. ఈ కేసు ద్వారా సానుభూతి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు దీనికి కేంద్రం కూడా సహకరిస్తోంది.