త‌మ్ముళ్లూ…. అధైర్య‌ప‌డ‌కండి… టీఆర్ఎస్ కంటే మ‌న‌కే ఎక్కువ సీట్లు

తెలంగాణ‌లో అనూహ్య ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ఖంగుతున్న తెలుగు త‌మ్ముళ్ల‌కు ధైర్యం నూరిపోసే ప‌నిలో ప‌డ్డారు చంద్ర‌బాబు నాయుడు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను రుజువుగా చూపించి వైసీపీ, జ‌న‌సేన ఇప్ప‌టికే తెలుగుదేశంపై పూర్తి స్థాయిలో అటాక్ ప్రారంభించాయి. ఏపీలో కూడా టీడీపీకి రెండు సీట్లే వ‌స్తాయ‌ని వాగ్బాణాలు ఎక్కుపెడుతున్నాయి.

దీన్ని తిప్పికొట్టి పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా చంద్ర‌బాబు నాయ‌కుల‌కు, కేడ‌ర్‌కు దిశానిర్దేశం మొద‌లుపెట్టారు. వైసీపీ, జ‌న‌సేన‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, వాళ్లు మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని, తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కంటే ఏపీలో మ‌న‌కు ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని ధైర్యం నూరిపోస్తున్నారు.

తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు ఉంటాయ‌న్న ప్ర‌చారాన్ని తెలుగుదేశం స‌మ‌ర్థంగా తిప్పికొట్ట‌లేక‌పోవ‌డం ఆపార్టీకి న‌ష్టం క‌లిగించేదే. రావెల జ‌న‌సేన‌లో చేర‌డం, తెలంగాణ‌లో ఓట‌మి, తాజాగా మోదుగుల‌, పితాని స‌త్య‌నారాయ‌ణ‌ల‌పై ప్ర‌చారం టీడీపీని ఇబ్బంది పెట్టే అంశాలే.

మ‌రోవైపు వైసీపీ, జ‌న‌సేన సోష‌ల్ మీడియా ద్వారా తెలుగుదేశంలో కొంత గంద‌ర‌గోళం క్రియేట్‌ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అనేక మంది తెలుగుదేశం నాయ‌కులు వైసీపీలో, జ‌న‌సేన‌లో చేర‌బోతున్నారంటూ ప్ర‌చారం చేస్తున్నారు. రావెల కిషోర్‌బాబు జ‌న‌సేన‌లో చేరిన తర్వాత ఈ ప్ర‌చారం మ‌రింత పూపందుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన మోదుగుల వేణుగోపాల‌రెడ్డి త్వ‌ర‌లో వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ కూడా త్వ‌ర‌లో వైసీపీలో చేర‌నున్నార‌ని జిల్లాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. దీన్ని తిప్పికొట్ట‌డంలో తెలుగు దేశం విఫ‌లం అవుతుంది. దీంతో నిప్పు లేనిదే పొగ రాదు అన్న చందంగా ప‌రిస్థితి ఉంది. ఇది తెలుగుదేశానికి న‌ష్టం చేసే ప‌రిణామ‌మే.  అస‌లే తెలంగాణ‌లో దారుణ ఓట‌మితో కొంత ఆందోళ‌న‌లో ఉన్న తెలుగు త‌మ్ముళ్లకు సీనియ‌ర్ నేత‌లు పార్టీలు మార‌డం, మారుతార‌నే ప్ర‌చారం జ‌ర‌గ‌డం మ‌రింత ఆందోళ‌న ప‌రిచే అంశాలే.