ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలి ప్రసంగాలు, వ్యాఖ్యలను పరిశీలిస్తే, మునుపటి ఉత్సాహం ఆయనలో ఉన్నట్టు కనిపించడం లేదు. నరేంద్ర మోదీపై చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శల్లో పస కనిపించడం లేదు. అలాగే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు కూడా అంత పదునుగా ఉండటం లేదు. అన్నిటికి మంచి పవన్ కళ్యాణ్‌తో పొత్తు విషయంలో ఒక అడుగు కిందికి దిగి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయనలో అభద్రతకు చిహ్నమా అనే సందేహం కలిగిస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుందా అని విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.
ఏపీలో రాజకీయ వాతావరణం, సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. తాజాగా ఇండియా టుడే – సీఎన్ఎక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఏపీలో వైసీపీకి అధిక ఎంపీ స్థానాలు వస్తాయని తేలింది. దీంతో చంద్రబాబులో అంతర్మథనం మొదలైనట్టు భావిస్తున్నారు. అందుకే ఎలాగైనా జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరితోనూ పొత్తు ఉండదని ట్విటర్ వేదికగా ప్రకటించినా… టీడీపీలో ఆశలు చావలేదు.
కేంద్రంలో వాతావరణం మోదీకి అనుకూలంగా ఉన్నట్టు కూడా సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కొంచెం సీట్లు తక్కువైనా టీఆర్ఎస్, వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీల మద్దతులో మోదీ మళ్లీ అధికారం చేపడతాడని విశ్లేషణలు వస్తున్నాయి. వైఎస్ జగన్ కూడా గతంలో కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఈ పరిణామాలు చంద్రబాబును ఇబ్బందిపెట్టేవే.
మరోవైపు కాంగ్రెస్‌తో ధైర్యంగా కలవలేని పరిస్థితి చంద్రబాబుది. నలభై ఏళ్లు పోరాడి, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌తో కలిస్తే జనం ఎలా స్పందిస్తారో అంచనా వేయడం కష్టమే. ఈ విషయంలో తెలంగాణ చేదు అనుభవం కూడా చంద్రబాబును ఇంకా వెంటాడుతున్నట్టుంది. ఏదేమైనా ప్రస్తుతం చంద్రబాబు, తెలుగుదేశం మరో సంధి దశకు చేరుకున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితిలో మార్పు వస్తే తప్ప టీడీపీకి గడ్డురోజులు తప్పేలా లేవు.