ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించడానికి ప్రభుత్వం, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్న మద్దతుదారులు చెబుతున్న ప్రధాన కారణాల్లో ఒకటి.. అభివృద్ధి వికేంద్రీకరణ. కానీ వాస్తవాలను పరిశీలిస్తే ఈ వాదనలో పెద్దగా పసలేదని తెలుస్తుంది. ఎందుకంటే అభివృద్ధి జరగని చోటకు రాజధానిని తరలించి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం అంటే సహేతుకంగా ఉంటుంది. కానీ ఇక్కడ అభివృద్ధి లేనిది అమరావతిలోొ.. అభివృద్ధి జరిగింది విశాఖలో.. మరి విశాఖకు రాజధాని తరలింపు అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా అవుతుంది?
అమరావతిలో అసలు అభివృద్ధి ఏమీ లేదని ఒకవైపు మంత్రులంతా రోజుకొకరు ఇద్దరు చొప్పున మాట్లాడుతున్నారు. ఒక మంత్రి అమరావతి ఒక స్మశానం అంటే స్పీకర్ అమరావతికి వెళితే ఎడారికి వెళ్లినట్టు ఉంటుంది అంటారు. అలాంటప్పుడు అమరావతిలోనే రాజధాని ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుంది కదా?
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నమే అభివృద్ధి చెందిన నగరం. విడిపోయిన తర్వాత ఏపీలో విశాఖ అన్నిటికంటే అభివృద్ధి చెందిన నగరం. జీడీపీ, తలసరి ఆదాయం, పారిశ్రామికీకరణ, సేవా రంగం విస్తరణ… ఇలా అనేక విధాలుగా విశాఖపట్నం అభివృద్ధి చెందింది. మరి వెనుకబడిన అమరావతి నుంచి అభివృద్ధి చెందిన విశాఖకు రాజధానిని తరలించడం అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా అవుతుందో మంత్రులే చెప్పాలి.
విశాఖలో రాజధాని అయితే పక్కనే ఉన్న వెనుకబడిన జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మరికొందరి వాదన. సరే, వాదన కోసం అయినా ఈ విషయం పరిశీలిద్దాం. హైదరాబాద్ రాజధానిగా అద్భుతంగా డెవలప్ అయితే పక్కనే ఉన్న మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలు ఎందుకు డెవలప్ కాలేదు. ఏపీలో చూసినా, గుంటూరు పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా ఎందుకు డెవలప్ కాలేదు. అందువల్ల అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించడానికి అభివృద్ధి వికేంద్రీకరణ ఏ మాత్రం సహేతుక కారణం కాజాలదు.