సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారాన్ని ఆపాలని కోరుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. షర్మిలకు, సినీ నటుడు ప్రభాస్‌కు మధ్య సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే రాజకీయ వాతావరణం బాగా వేడెక్కుతున్న సందర్భంలో ఈ ప్రచారం కూడా ఊపందుకుంటోంది. దీంతో షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పలేదు.
రాజకీయ, సినిమా ప్రముఖులపై సోషల్ మీడియాలో భారీగా బురదచల్లుడు కార్యక్రమం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే రాజకీయ పార్టీలే సోషల్ మీడియా విభాగాలు ఏర్పాటు చేసి వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలకు దిగుతుండటం ఇందులో మరో కోణం. ఇందులో టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, ఇతర అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉంది. దీనికి కొనసాగింపే వ్యక్తిగత విమర్శలు, మహిళా నేతలపై బురదజల్లుడు.
ఏ పార్టీకి చెందిన వారైనా మహిళా నేతలపై విమర్శలు చేసేటప్పుడు సంయమనం పాటించడం తప్పనిసరి. ఏపీ రాజకీయాల్లో ఈ సంయమనం లేదనే చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు మీద అసభ్య రాతలు రాసినందుకు పొలిటికల్ పంచ్ అనే ఫేస్‌బుక్ / వెబ్ మాధ్యమ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత బ్రాహ్మణి, రోజా, యామినీ శర్మ సాదినేని, షర్మిల.. ఇలా చాలామంది టార్గెట్‌గా సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి.
అయితే షర్మిల తన ఫిర్యాదును ఏపీ పోలీసులకు కాకుండా, తెలంగాణ పోలీసులకు ఇవ్వడంతో మొత్తం వ్యవహారం బాగా రాజకీయ రంగు పులుముకొంది. ఏపీ పోలీసులపై నమ్మకం లేదనీ, తనపై ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని పేర్కొనడంతో విషయం పక్కదారి పట్టింది. షర్మిలపై తప్పుడు ప్రచారాలు నిజమే అయినా, ఒకసారి రాజకీయ రంగు పులుముకున్నాక, దాని ప్రాధాన్యం తగ్గిపోయింది. అందరూ ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు కదా అనే చర్చ జరుగుతుంది తప్పిస్తే, తప్పొప్పుల జోలికి నాయకులు, మీడియా, విశ్లేషకులు వెళ్లరు. ఇది పరిణతి చెందిన రాజకీయాలు ఆశించేవారికి నిరాశాజనకమే.