తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగనుంది. ఇటీవలే కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. వీరిద్దరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. అందుకే టీడీపీ అధినేత ఈ షరతు విధించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునేవారు తమ ప్రస్తుత పదవులకు రాజీనామాలు చేయాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది.
ఇదే బాటలో మంత్రి నారాయణతోపాటు చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసే అవకాశం ఉంది. మంత్రి నారాయణ ఇప్పటికే ప్రత్యక్ష ఎన్నికల్లో దిగడానికి సిద్ధమయ్యారు. మరోవైపు లోకేష్ మాత్రం తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది ఇంకా ఖరారు కాలేదు. దీనిపై స్పష్టత వచ్చాక లోకేష్ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేస్తున్నవారంతో తమ గెలుపుపై చాలా ధీమాతో ఉన్నారు. అందుకే ఒక పదవి అనుభవిస్తూ మరో పదవి కోసం పోటీపడకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. అయితే ఈ సూత్రం యనమల రామకృష్ణుడు లాంటి కొంతమంది సీనియర్లకు వర్తించకపోవచ్చు.
అంతేగాక ఎమ్మెల్యే టికెట్ రానివారు పార్టీని వీడిపోకుండా, వారికి ఎమ్మెల్సీ టికెట్ ఆశ చూపించడానికి చంద్రబాబు నాయుడు ఈ వ్యూహం రచించినట్టు సమాచారం. ఎవరైనా ముఖ్యనేతలకు రకరకాల కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోతే వారికి ఎమ్మెల్సీ పదవి ఆశ చూపే అవకాశం ఉండాలంటే,,,, ముందు ఈ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయాల్సిందే. ప్రస్తుత రాజీనామాలు ఇందులో భాగమేనని రాజకీయ వర్గాల సమాచారం.