బీజేపీ అధినేత అమిత్ షా శ్రీకాకుళం పర్యటన ద్వారా చాలామందికి తెలియని ఓ వ్యక్తి వెలుగులోకి వచ్చారు. ఆమె సంచైతా గజపతిరాజు. పూసపాటి రాజవంశీయుల కుమార్తెగా ఆమె సభకు హైలైట్‌గా నిలిచారు. సంచైతా గజపతిరాజు మాజీ మంత్రి పి. ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతిరాజు కుమార్తె. సంచైత ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం అమిత్ షా సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
సంచైత తండ్రి ఆనందగజపతిరాజు, ప్రస్తుత ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి. అశోక్ గజపతిరాజుకి స్వయానా సోదరుడు. సంచైత గజపతిరాజు, ఆమె తల్లి ఉమా గజపతిరాజు విలాసవంతమైన లైఫ్ స్టయిల్‌కి ప్రతీకగా ఉంటారు. హై క్లాస్ మహిళా సర్కిల్స్‌లో, పార్టీల్లోనే కనిపిస్తుంటారు. రాజకీయాల్లోకి రావడంతో ఇప్పుడు ప్రజలకు కనిపిస్తున్నారు.
సంచైత గజపతిరాజు ఉత్తరాంధ్రలోని ఏదైనా ఎంపీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో ఏ మాత్రం గెలిచే అవకాశాలు లేవు. మరి సంచైత రాజకీయ భవితవ్యం ఎలా ఉండనుందో చూడాలి.