మొత్తానికి పార్లమెంట్ సమావేశాల చివరి రెండు రోజులు రాజ్యసభలో వైసీపీ, బీజేపీ నేతలు రక్తికట్టించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ గురించి ప్రత్యేక ప్రశ్నలు అడగటం, దానికి బీజేపీ సభ్యులు, మంత్రులు ప్రత్యేక సమాధానాలు ఇవ్వడం రక్తికట్టింది. రెండు రోజులూ విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నలు, దానికి మంత్రుల సమాధానాలు చూస్తే అసలు విషయం పిల్లాడికి కూడా అర్థమవుతుంది.
సభ ముగియడానికి ముందురోజు విజయసాయిరెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా గురించి సభలో ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంతా శభాష్ అనుకున్నారు. దీనికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామనీ, దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఒప్పుకున్నారనీ, తర్వాత యూటర్న్ తీసుకున్నారనీ సమాధానం చెప్పారు. సో… ఈ ప్రశ్న.. కేంద్ర మంత్రి జవాబు చూస్తే ఏం అర్థమవుతుంది?
ఇక చివరిరోజు కూడా ఇలాంటి ప్రశ్న – జవాబు ప్రహసనం నడిచింది. విజయ సాయిరెడ్డి లేచి… మేడమ్ స్పీకర్, ఆంధ్రాకు ఇవ్వాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదని, అమరావతికి, ఆర్థిక లోటుకు నిధులు ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి మాన్యశ్రీ అరుణ్ జైట్లీ లేచి… ఏపీ రాజధాని నిర్మాణానికి, ఆర్థిక లోటుకు 60 వేల కోట్లపైనే ఇచ్చామని లెక్కలు చెప్పారు. ఇంతటితో ఏపీకి సంబంధించినంతవరకు పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి.