గుంటూరులో నిర్వహించిన మోదీ సభకు వైసీపీ జనాన్ని సమీకరించిందని నారా లోకేష్ విమర్శించారు. జగన్ ఫొటోలు, బీజేపీ జెండాలు కట్టిన ఆటోల ఫొటోలను ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో
లోకేష్ అప్‌లోడ్ చేశారు. దీంతో మరోసారి వైసీపీ, బీజేపీ మధ్య మైత్రి బయటపడిందని లోకేష్ విమర్శించారు.
దీంతోపాటు ప్రధాని మోదీ ఏపీ పర్యటన సందర్భంగా జగన్‌పై నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఏపీ అంతా మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏం చేస్తున్నారంటూ విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ లోటస్‌పాండ్‌లో పడుకున్నారా అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ మౌనం మరోసారి బీజేపీతో వారి పొత్తును బయటపెట్టిందని ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ ఏపీ పర్యటన, గుంటూరులో బహిరంగ సభపై ఏపీలో నిరసనలు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా మోదీ పర్యటనపై పెదవి విప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.