ప్రధానమంత్రి ఏపీ పర్యటన ఉద్రిక్తంగా మారుతోంది. నిధుల విషయంలో ఏపీకి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలపాలని తెలుగుదేశం పిలుపు ఇచ్చింది. దీంతో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకున్నాయి. కొన్ని పథకాలు ప్రారంభించి, అనంతరం బహిరంగ సభలో మాట్లాడటానికి ఆదివారం ప్రధాని ఆంధ్రప్రదేశ్ రానున్నారు.
ప్రధాని విమానం దిగి గుంటూరు చేరుకునే గన్నవరం విమానాశ్రయం – గుంటూరు రహదారిలో భారీఎత్తున హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. మోదీ గో బ్యాక్, స్టాప్ మోదీ అంటూ రకరకాల నినాదాలతో ఆయా ప్రదేశాలలో బ్యానర్లు కట్టారు. నల్ల జెండాలతో రాష్ట్రంలోని పలు చోట్ల ఆందోళనలు కూడా చేపట్టారు. ఈ నిరసనలు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది.
ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నిరసనలు ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మోదీని ఏపీలో అడుగుపెట్టనివ్వమని తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు వామపక్షాల నేతలు, కార్యకర్తలు కూడా మోదీ పర్యటనకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోదీ ఇచ్చిన నీళ్లు, మట్టికుండలతో నిరసనలు చేపట్టారు. కొన్ని చోట్ల టీడీపీ, వామపక్షాలు కలిసి నిరసనలు చేపట్టడం విశేషం.
దీంతో రేపటి మోదీ పర్యటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఇంటెలిజన్స్ నివేదికలు ఏం చెబుతాయనే దాన్ని బట్టి మోదీ పర్యటన కొనసాగించాలా వద్దా అనేది తేలే అవకాశం ఉంది. ఇంటెలిజన్స్ నివేదికల ఆధారంగానే గత నెలలో పర్యటనను మోదీ వాయిదా వేసుకున్నారు. మళ్లీ అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉంది.