బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ముర‌ళీ మోహ‌న్ అట‌..!

టీడీపీ, బీజేపీ వైరం ముదిరి పాకాన ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. తాజాగా వై సుజ‌నా చౌద‌రి కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దాడుల‌తో టీడీపీకి ఈపాటికి విష‌యం అర్థ‌మ‌య్యే ఉంటుంది. త‌ర్వాత టార్గెట్ ఎవ‌ర‌నేది ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌. నిర్మాత‌, ఎంపీ మాగంటి ముర‌ళీమోహ‌న్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. జ‌య‌భేరి పేరుతో హైద‌రాబాద్‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం, సినిమా వ్యాపారం ముర‌ళీ మోహ‌న్‌కు ఉన్నాయి.

సుజ‌నా చౌద‌రి, బ్యాంకుల మ‌ధ్య గొడ‌వ‌లు ఎప్ప‌టినుంచో ఉన్నాయి. అయితే కేంద్రంలో మంత్రిగా ఉండ‌టం, కేంద్ర‌ ప్ర‌భుత్వంలో టీడీపీ భాగ‌స్వామిగా ఉండ‌టం వ‌ల్ల ఈ గొడ‌వ‌లు పైకి రాలేదు. వ‌చ్చినా మేనేజ్ చేయ‌గ‌లిగారు. కానీ మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో బీజేపీ ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకునేట్టు క‌నిపించ‌డం లేదు. తెలుగుదేశం నాయకులు ఒక్కొక్క‌రిని బ‌య‌ట‌కు లాగ‌డం ల‌క్ష్యంగా క‌నిపిస్తుంది.

ఏపీ మంత్రి నారాయ‌ణ‌, తెలంగాణ టీడీపీ నేత దేవేంద‌ర్ గౌడ్‌, టీడీపీ నేత‌ల బంధువుల కంపెనీలైన శుభ‌గ్రుహ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్స్‌, ప్ర‌కాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత పోతుల రామారావు, త‌దిత‌రుల మీద ఇప్ప‌టికే ఐటీ దాడులు జ‌రిగాయి. ఇంకా ఎవ‌రెవ‌రు లిస్టులో ఉన్నార‌నేది రాబోయే రోజుల్లో చూడాల్సిందే.