ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ఇతర పార్టీల నేతలపై గాలం వేస్తున్నాయి. కొంతమంది ఆయా పార్టీల్లో తమ భవిష్యత్తును ముందే పసిగడుతూ లాభం లేదనుకొని వేరే పార్టీలోకి వెళుతున్నారు. గత వారం రోజుల్లో టీడీపీ, వైసీపీ, జనసేనల్లో ముఖ్య నేతల రాజీనామాలు, చేరికలు జరిగాయి.
రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా మళ్లీ కమలం గుర్తుపై గెలవడం అసాధ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో కాపు కులస్తుల ఓట్లు, జనసేన ఓట్ బ్యాంకు, టికెట్‌పై హామీ తదితర అంశాలను పరిగణించి ఆయన జనసేనలో చేరారు.
మరో ముఖ్య పరిణామం… ప్రముఖ కాపు నేత వంగవీటి రాధా తెలుగుదేశంలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం. ఇంకా పార్టీలో చేరకపోయినా టీడీపీ అధినేతే సమావేశంలో చెప్పారు కాబట్టి ఇది దాదాపు ఖరారైనట్టే. వైసీపీ నుంచి టికెట్ హామీ రాకపోవడంతో రాధా టీడీపీ వైపు వస్తున్నారు. ఈ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి హామీ లభించినట్టు చెబుతున్నారు.
కడపలోనూ ఇదే తంతు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కొంతకాలంగా జిల్లాలో పార్టీకి వ్యతిరేకంగా మేడా పనిచేస్తున్నారని టీడీపీ నేతలు మేడాపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు మళ్లీ సీటు దక్కడం అనుమానంగా మారింది. ఆయనే మేల్కొని వైసీపీలోకి వెళ్లారు. ఎన్నికలు సమీపిస్తుండటం, పార్టీల అభ్యర్థులు కూడా ఖరారవుతుండటంతో ఈ ధోరణి మరింత పెరిగే అవకాశం ఉంది.