తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు విషయం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. చంద్రబాబు నాయుడు జనసేన పట్ల సానుకూల వైఖరిని అవలంభిస్తుండటం ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వై.ఎస్. జగన్, కేసీఆర్, మోదీలపైనే చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారు. ఆ మేరకు టీడీపీ పార్టీ శ్రేణులకు కూడా సూచనలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా కొన్ని సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. గతంలో మాదిరిగా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడును గానీ, లోకేష్‌నుగానీ, టీడీపీని గానీ విమర్శించడం లేదు. అంతేగాక జగన్, కేటీఆర్ కలవడాన్ని విమర్శించారు. దీంతో రాజకీయ వర్గాల్లో టీడీపీ, జనసేన పొత్తుపై ఆసక్తి నెలకొంది.
ఈనెల 27 గుంటూరులో జనసేన భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడే అంశాలను బట్టి టీడీపీ పట్ల జనసేన వైఖరి ఏంటనేది మరింత స్పష్టం కానుంది. గతంలో పవన్ కళ్యాణ్ గుంటూరు సభ నుంచే చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇవ్వదలచిన 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం మరో కీలక పరిణామం. పవన్ కళ్యాణ్ ప్రధాన ఓటు బ్యాంకు కాపులే కాబట్టి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ పట్ల పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉంటుందనేది చూడాలి.