ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమపై దృష్టి సారించినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భూమా కుటుంబాన్ని పార్టీలోకి తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న భూమా అఖిలప్రియ పార్టీ మారబోతున్నట్టు వార్తలు రావడం కలకలంగా మారింది. కర్నూలు జిల్లాలో కాపు జనాభా కూడా గణనీయంగా ఉండటం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
భూమా కుటుంబంతో చిరంజీవికి గతంలో ఉన్న సంబంధాల రీత్యా పవన్ కళ్యాణ్ నుంచి అఖిల ప్రియకు ఆహ్వానం అందినట్టు చెబుతున్నారు. జనసేనలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో అఖిల ప్రియతోపాటు, తన చెల్లెలు మౌనిక, బ్రహ్మానందరెడ్డికి అసెంబ్లీ టిక్కెట్లు ఇస్తామని పవన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. అఖిల ప్రియ భర్త కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం విశేషం.
ప్రస్తుతం అఖిలప్రియ ఆళ్లగడ్ఢ నుంచి బ్రహ్మానందరెడ్డి కర్నూలు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం తరపున భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. శోభా నాగిరెడ్డి మృతి తర్వాత భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరారు. ఆయన ఆకస్మిక మరణంతో అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు.
స్థానికంగా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలు భూమా కుటుంబానికి అడ్డంకిగా మారాయి. జిల్లాలో సీనియర్ నాయకులను అఖిల ప్రియ పక్కన పెడుతున్నారనే విమర్శ ఉంది. సీనియర్ నాయకులను కలుపుకొని పోవాలని చంద్రబాబు గతంతో అఖిల ప్రియకు సూచించారు. చంద్రబాబుతో అనేక సార్లు పంచాయతీ పెట్టినప్పటికీ వివాదాలు పరిష్కారం కాకపోవడంతో భూమా కుటుంబం కొంతకాలంగా కినుక వహిస్తుంది.