ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు ఇంకా వారం రోజులు టైముంది. అయితే మంత్రివర్గంలో ఎవరుంటారు, డిప్యూటీ సీఎం పదవులు ఉంటాయా, ఉంటే ఎవరికి ఇస్తారు… ఇలా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. పదేళ్ల నుంచి జగన్‌తో నడుస్తున్న సీనియర్ నాయకులతోపాటు, జగన్‌కు నమ్మకంగా ఉండే యువ నాయకులు కూడా డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీలో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారే. కాంగ్రెస్ నుంచి జగన్ బయటికొచ్చి పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి, సుభాష్ చంద్రబోస్ ముఖ్యులు. వీరిలో బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్‌కు అత్యంత నమ్మకస్తుడు. డిప్యూటీ సీఎం పదవంటూ ఉంటే వారిలో బాలినేని తప్పకుండా ఉంటారని ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్ నుంచి వచ్చని ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం నుంచి వచ్చిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుంటే వీరిలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చు.
అలాగే ఈసారి ఎన్నికల్లో మహిళలు భారీగా వైసీపీకి ఓట్లు వేశారు. 13 మంది మహిళలు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో మేకతోటి సుచరిత, రోజా, పుష్ఫ శ్రీవాణి సీనియర్లు. గత శాసనసభలో టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించి సభ నుంచి బహిష్కరణకు గురైన రోజా జగన్‌కు నమ్మకస్తురాలిగా మారారు. మహిళల ఓట్లు మాత్రమే కాదు, వారికి మంత్రివర్గంలో మంచి స్థానం ఇవ్వాలని జగన్ భావిస్తే రోజా, సుచరితల్లో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కూడా డిప్యూటీ సీఎం పదవికి గట్టిగా వినిపిస్తోంది. కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను ఓడించి రామకృష్ణారెడ్డి తన సత్తా నిరూపించుకున్నారు. దీనికి ప్రతిఫలంగా రామకృష్ణారెడ్డికి డిప్యూటీ సీఎం పదవి దక్కొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.