ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్‌పై దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీ టాకూర్‌కి ఫోన్ చేయడం, తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించడం ఒకింత ఆలోచనలు రేపేవే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అమల్లో ఉంది. రాష్ట్రపతి పాలన లేదు. ఢిల్లీ మాదిరిగా ఏపీ సగం కేంద్ర పాలిత ప్రాంతం కూడా కాదు. అలాంటప్పడు గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడం ఏంటా అని విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకున్నట్టు అనే ఆలోచన రాకమానదు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో గవర్నర్ అత్యుత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి ఫోన్ చేయడంపై సీఎం చంద్రబాబు కూడా మండిపడ్డారు. నేరుగా డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని ప్రశ్నించారు. దాడికి సంబంధించి ఏమైనా వివరాలు కావాల్సి ఉంటే నేరుగా తనకు ఫోన్ చేయాలి కానీ డీజీపీకి ఎలా చేస్తారని చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో గవర్నర్ కేంద్రానికి ఎన్ని నివేదికలు పంపినా తాను మాట్లాడలేదని, ఈసారి తాను గవర్నర్‌పై స్పందిస్తున్నానని చెప్పారు. వాస్తవానికి చంద్రబాబు ఈసారి గతంలోకంటే గట్టిగానే కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ స్క్రిప్టు ఇక్కడ అమలు చేయాలనుకుంటే కుదరదని, తీవ్రంగా పోరాడతామని తనదైన శైలిలో చెప్పారు.
మొత్తం మీద వైఎస్ జగన్‌పై దాడి ఎయిర్‌పోర్టులో జరగడం లేదా జరిపించుకోవడం చంద్రబాబుకు కలిసొచ్చింది. ఎయిర్‌పోర్టు కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి తన ప్రభుత్వ భద్రతా వైఫల్యం లేదని గట్టిగా వాదించే అవకాశం ప్రభుత్వానికి లభించింది. దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే కేంద్ర మంత్రులు, సీఐఎస్ఎఫ్, కేసీఆర్, కేటీఆర్, పవన్, జీవీఎల్ అంతా వాయువేగంతో ఖండనలు చేయడంతో దాడి తీరుపట్ల కొంతమందికైనా అనుమానాలు కలగడం సహజమే. అందుకే ఏపీ మంత్రులు, చంద్రబాబు అంత ధీమాగా మాట్లాడగలుతున్నారేమో.