ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల్ కిషోర్‌బాబు బాటలోనే మరో ఎమ్మెల్యే నడుస్తున్నట్టు గుంటూరు జిల్లాలో వదంతులు ఊపందుకున్నాయి. టీడీపీకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
రెడ్డి సామాజిక వర్గం వారు నిర్వహించిన కార్తీక వన మహోత్సవంలో మోదుగుల చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, తెలుగుదేశం పార్టీ సర్కిళ్లలో హల్‌చల్ చేస్తున్నాయి.
తెలుగుదేశంలో పార్టీలో తన పరిస్థితి పట్ల ఏమాత్రం సంతృప్తిగా లేనట్టు మోదుగుల ఆ సమావేశంలో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అంతేగాక ఈసారి మన వర్గం వారిని గెలిపించుకోవాలనీ, రెడ్ల రాజ్యం రావాలనీ భగవంతుడిని తాను కోరుకుంటున్నట్టు చెప్పినట్టు ప్రచారంలో ఉంది. దీంతో తెలుగుదేశంలో కొంత అలజడి మొదలైంది.
నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచే తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా మోదుగు చెప్పారట. ఇలాంటి ప్రకటనలు సాధారణంగా తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకమే.
అంతేగాక గురజాలలో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని పరోక్షంగా మోదుగుల సూచించినట్టు కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు మళ్లీ అమరావతి చేరుకుంటేగానీ ఈ వ్యవహారం కొలిక్కిరాదు!